రికార్డు బద్దలు కొట్టిన తంబీలు,,,కింగ్ ఎవరో ?

తమిళనాడులో ఎన్నికల యుద్ధం ముగిసింది. గత కొన్ని నెలలుగా వేడిగా వాడిగా సాగిన ఎన్నికల సమరానికి ముగింపుగా గురువారం జరిగిన పోలింగ్ మొత్తం ప్రశాంతంగా సాగింది.;

Update: 2026-04-24 03:39 GMT

తమిళనాడులో ఎన్నికల యుద్ధం ముగిసింది. గత కొన్ని నెలలుగా వేడిగా వాడిగా సాగిన ఎన్నికల సమరానికి ముగింపుగా గురువారం జరిగిన పోలింగ్ మొత్తం ప్రశాంతంగా సాగింది. ఏకంగా 85 శాతం దాకా పోలింగ్ జరగడం తమిళ చరిత్రలో ఇదే తొలిసారి ఇంకా చెప్పాలీ అంటే స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మొదటి సారి ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ జరగడం అని తెలుస్తోంది. ఇక చూస్తే కనుక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈసారి త్రిముఖ పోరు భీకరంగా సాగింది. అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకే కూటమితో పాటు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోని దళపతి విజయ్ కొత్త పార్టీ టీవీకే కూడా రేసులో దూసుకుని వచ్చింది. దాంతో ఓటర్లు అంతా పోలింగ్ బూత్ లకు ఎగబడి వచ్చిన దృశ్యాలు అన్ని చోట్లా కనిపించాయి.

యువ ఓటర్ల హుషారు :

ఇక తమిళనాడు మొత్తం ఓటర్ల సంఖ్య 5.73 కోట్లుగా ఉంది. ఇందులో 2.93 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉంటే 2.83 కోట్ల మంది పురుష ఓటర్లు 7,728 మంది తృతీయ లింగ ఓటర్లు ఉన్నారు. వీరితో పాతు ఈసారి ఎన్నికల జాతకాన్ని తారు మారు చేస్తారు అని భావిస్తున్న 14,59,039 మంది తొలిసారి ఓటు వేస్తున్న యువ ఓటర్లు సైతం ఉన్నారు. ఇక గురువారం రాత్రికి తమిళనాడు ఓటర్లలో 85.5 శాతం మంది అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలుస్తోంది. దాంతో ఈ ఎన్నికలు పోటీలో ఉన్న 4 వేల 23 మంది అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తును వీరంతా నిర్ణయించనున్నారన్నమాట.

సజావుగానే పోలింగ్ :

ఇక చూస్తే కనుక ఈసారి తమిళనాడులో పోలింగ్ సజావుగా సాగింది. పోలింగ్ బూత్‌ల వద్ద ఓటు వేయడానికి ప్రజలు ఉదయం ఏడు గంటల గంటల లోపే బారులు తీరడం మొదలైంది. రాష్ట్రంలోని 38 జిల్లాలలోని 32 జిల్లాల్లో 80 శాతానికి పైగా ఓట్లు నమోదయ్యాయి. ఇది 2011లో పునర్విభజన తర్వాత నమోదైన 78 శాతం ఓట్ల రికార్డును అధిగమించింది. అత్యధికంగా కరూర్‌లో 92 శాతం ఓట్లు నమోదు కాగా, ఆ తర్వాతి స్థానాల్లో సేలం, ధర్మపురి, ఈరోడ్‌లలో 90 శాతం పైగా ఓట్లు నమోదయ్యాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే పశ్చిమ జిల్లాల్లో ఎక్కువ ఓట్లు నమోదయ్యాయి. చెన్నై జిల్లాలో 83.44 శాతం ఓట్లు నమోదయ్యాయి. చెన్నైలోని 16 నియోజకవర్గాలలో చూస్తే పన్నెండు నియోజకవర్గాల్లో 80 శాతం పైగా ఓట్లు నమోదయ్యాయి. అలాగే ఆర్కే నగర్ పెరంబూర్ నియోజకవర్గాల్లో 89 శాతం పైగా ఓట్లు నమోదయ్యాయి. పెరుందరై అసెంబ్లీ నియోజకవర్గంలో 92 శాతానికి పైగా, భవానీలో 91 శాతానికి పైగా ఓట్లు నమోదయ్యాయి.

హోరా హోరీ పోరు :

ఇదిలా ఉంటే ఈసారి తమిళనాడు ఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపించాయి. ఈ హోరాహోరీ పోరులో ప్రధానంగా అధికార డీఎంకే నేతృత్వంలోని కూటమి ఒక వైపు ఉంటే ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరో వైపు ఉంది. ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి గెలవాలని పట్టుదలగా పనిచేశారు. ఐదేళ్ల తర్వాత అధికార పీఠం అందుకోవాలని మాజీ సీఎం ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి సర్వ శక్తులూ ఒడ్డారు. యువ ఓటర్లతో పాటు వివిధ వర్గాలను ఆకర్షిస్తూ దళపతి విజయ్ కూడా తన ప్రభావాన్ని గణనీయంగా చూపించారు అని అంటున్నారు. చాలా పోలింగ్ బూత్ ల వద్దకు పలువురు యువ ఓటర్లు టీవీకే కు మద్దతుగా భావిస్తున్న రంగుల కోడ్ కలిగిన దుస్తులు ధరించి రావడం బట్టి చూస్తే విజయ్ జోరుని కొట్టిపారేయడానికి లేదని అంటున్నారు.

సర్ ప్రభావంతోనే :

ఈసారి భారీ స్థాయిలో ఓటింగ్ శాతం పెరుగుదలకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సంస్కరణలే కారణమని బీజేపీ పేర్కొంది. తమిళనాడు వ్యాప్తంగా నమోదైన అధిక పోలింగ్ శాతం బలమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ అధిక పోలింగ్ అన్నది ఎన్డీయే విజయానికి ఒక నమ్మకమైన సంకేతమని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. ఇలా ప్రశాంతంగా చక్కంగా ఎన్నికలు నిర్వహించిన ఘనత సర్ ప్రక్రియకే దక్కుతుందని అంటున్నారు. అధికార డీఎంకే అయితే మరోసారి తమదే అధికారం అని గట్టిగా చెబుతోంది. అలాగే టీవీకే నేతలు సైతం ఇది భారీ మార్పునకు సంకేతం అని అందుకే పోలింగులో రికార్డులు బద్ధలు అయ్యాయని అంటున్నారు. మే 4న ఫలితాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News