వైసీపీ ఎంపీ మీద మా లావు సందేహాలు... ఎందుకలా...?

Update: 2023-02-07 08:00 GMT
ఆయన ప్రముఖ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య కుమారుడు. తనకంటూ ఒక ఇమేజ్ ని లోకల్ గా క్రియేట్ చేసుకున్న నాయకుడు. నరసారావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీక్రిష్ణదేవరాయలు. మూడున్నర పదుల వయసులో ఎకాఎకీ రాజకీయాల్లోకి రావడం ఎంపీగా నెగ్గడం ద్వారా లావు మా లావు పేరు సంపాదించారు. జగన్ ఆయన్ని ఏరి కోరి టికెట్ ఇచ్చారు. ఇక నరసారావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని ఎమ్మెల్యే సీట్లూ వైసీపీ గెలిచింది.

ఇలా లావు పేరు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మారుమోగింది. యువ ఎంపీగా ఉన్న లావు ఢిల్లీలో తనకంటూ ఒక సర్కిల్ ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే లావు ఇటీవల కాలంలో వార్తలలో నలుగుతున్నారు. ఆయన తెలుగుదేశానికి దగ్గర అవుతున్నారు అని ప్రచారం సాగుతోంది. ఇక అది ఇపుడు పీక్స్ కి చేరిపోయింది. లావు ఈ మధ్య చంద్రబాబుని రహస్యంగా కలసి వచ్చారన్నది తాజాగా జరుగుతున్న ప్రచారం.

దాంతో వైసీపీ హై కమాండ్ అప్రమత్తం అయింది. ఎందుకంటే ఈ మధ్యనే నెల్లూరు జిల్లాకు చెందిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అధినాయకత్వం మీదనే తిరుగుబాటు చేసి సంచలనం రేపారు. దాంతో ఇపుడు లావు వంతు అయిందా అనుకుని వైసీపీ పెద్దలు అటు వైపుగా అనుమానంగా చూస్తున్నారు. ఇక లావు పరిస్థితి చూస్తే ఆయన పార్లమెంట్ లో అందరి ఎంపీలతో మంచిగా ఉంటారు. పార్టీలకు అతీతంగా ఆయన మెలుగుతారు.

ఆయన ఆ మధ్య తెలుగుదేశం ఎంపీలతో కనిపించి గ్రూపు ఫోటోలు దిగి మరీ సంచలనం రేపారు నాటి నుంచే మెల్లగా డౌట్లు వచ్చాయి. ఇక లావు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న చిలకలూరిపేట ఎమ్మెల్యే కం మంత్రి అయిన విడదల రజనీతో ఆయనకు అసలు పడడంలేదు. ఆ విషయంలో అధినాయకత్వం జోక్యం చేసుకుని సర్దుబాటు చేసినా అది అలాగే కొనసాగుతొంది. ఎంపీ వర్సెస్ మంత్రి వివాదం అలాగే ఉంది. వర్గ పోరు కూడా సాగుతోంది.

దీంతో పాటు అధినాయకత్వం విషయంలో కొన్ని విషయాల్లో లావు అసంతృప్తిగా ఉన్నారు అని కూడా ప్రచారంలో ఉంది. దానికి తోడు అన్నట్లుగా ఇపుడు ఏకంగా ఆయన చంద్రబాబుని కలసి వచ్చారు అని ప్రచారం అయితే జోరుగా సాగిపోయింది. అది ఎంతదకా అంటే లావు శ్రీక్రిష్ణదేవరాయలు పనిగట్టుకుని మీడియా ముందుకు వచ్చి ఇదే విషయం మీద వివరణ ఇచ్చేంతవరకూ.

తన గురించి ఎందుకు ఈ విధంగా ప్రచారం సాగుతోందో తనకు అర్ధం కాదని ఆయన అంటున్నారు. తాను చంద్రబాబుని కలిసిందే లేదని ఆయన కుండబద్ధలు కొట్టారు. ఆ విషయాన్ని ప్రచారం చేసిన వారే నిరూపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తాను ప్రజల కోసం ఎంపీని అయ్యాను అని వారి సమస్యలను పరిష్కరించడం మీదనే తన ఫోకస్ ఉంటుందని, అలాంటి తన మీద ఈ తరహా ప్రచారం చేయడమేంటి అని ఆయన మండిపడ్డారు. తాను మీడియాతోనే ఎపుడూ ఉంటానా అని ప్రశ్నించారు.

తాను  మీడియాలో కనిపించాలని కోరుకోనని తన మీద వచ్చే రూమర్స్ అన్నింటికీ ఇదే సమాధానం అని ఆయన అంటున్నారు. మొత్తానికి లావు తన మీద వచ్చిన డౌట్లకు వివరణ అయితే గట్టిగానే ఇచ్చారు. కానీ లావు పార్టీ మార్పు విషయంలో అలా వస్తూనే ఉన్న ప్రచారం ఇకనైనా ఆగుతుందా అన్నదే చూడాల్సి ఉంది. ఏది ఏమైనా వైసీపీలో వరసబెట్టి వినిపిస్తున్న అసమ్మతి స్వరాలను బట్టి చూస్తూంటే ఏది నిజమో ఏది అబద్ధమో అర్ధం కావడం లేదని సగటు కార్యకర్తలు కూడా అనుకోవాల్సి వస్తోందిట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News