ఎస్ బాస్ అన్న వారే జై జగన్ అంటూ టికెట్ల వేటకు రెడీ

Update: 2022-12-13 02:30 GMT
ఎస్ బాస్ అని సలాం కొట్టే ఉన్నత స్థాయి అధికారులు వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తన కంటిని కాపుగా వేసి జాగ్రత్తగా చూసుకున్న వారు ఇపుడు కొత్త అవతారం ఎత్తబోతున్నారుట. వారంతా కూడా తమ అధికారి హోదాను ఉద్యోగాన్ని వదిలేసి వైసీపీ కండువా తగిలించేసుకుని జై జగన్ అంటూ రాజకీయ నేతలుగా మారుతారని టాక్ నడుస్తోంది.

ఈ సంఖ్య ప్రస్తుతానికి అయిదు దాకా ఉంది. వీరంతా వీర లెవెల్ లో విధేయత వైసీపీ సర్కార్ కి చూపించిన అధికారులుగా చెబుతున్నారు. వీరిలో ఒక ఐపీఎస్ అధికారి అయితే పార్టీ నేతల కంటే ఎక్కువగా విధేయత చూపించి వైసీపీ హై కమాండ్ వద్ద మార్కులు కొట్టేసారు అని అంటున్నారు.

ఇపుడు వీరు తాము రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా జగన్ కి హింట్ ఇచ్చారు అని అంటున్నారు. పైగా తాము పోటీ చేయబోతే సీట్లను కూడా జాగ్రత్తగా ఎంచి పెట్టుకున్నారట. అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ మంచి ముహూర్తం చూసి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు. వీరిలో కొందరికి రిటైర్మెంట్ దగ్గరపడింది. దీంతో వారు అలా ఉద్యోగం పోగానే ఇలా రాజకీయాల్లోకి రావచ్చు. మరి కొందరు దరిదాపుల్లో ఉన్నవారు, ఇంకొందరు అయితే వాలంటరీ రిటైర్మెంట్ కి సిద్ధమై వైసీపీలో చేరడానికి సై అంటున్నారుట.

ఇలా ఎందుకు అంటే వీరి విధేయత ఒక లెవెల్ లో ఉందిట. వీరు వైసీపీ ఏలుబడిలో ప్రభుత్వానికి చేసిన సేవలు పీక్స్ కి చేరాయని, ఇక ప్రతిపక్షం వారికి పవర్ ఏంటో చూపించారు అని అంటున్నారు. ఒక వేళ ప్రభుత్వం మారితే వీరంతా చుక్కలను చూడాల్సి వస్తుందని ముందు జాగ్రత్తగా ఉన్న ఉద్యోగాలను వదిలేసి మరీ రాజకీయ రంగ ప్రవేశం చేయాలని చూస్తున్నారుట.

దాంతో వీరి విషయంలో హై కమాండ్ కూడా సుముఖంగా ఉంది అని అంటున్నారు. ఎందుకంటే వీరి సేవలను అలా అందుకుని అస్వాదించారు కాబట్టి ఆ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని భావించవచ్చు అంటున్నారు. ఇక చూస్తే వీరంతా రిజర్వ్డ్ సీట్ల నుంచే పోటీకి తయారు అని అంటున్నారు. దాంతో అక్కడ ప్రస్తుతం ఉన్న సిట్టింగులకు గండం పొంచి ఉంది అని అంటున్నారు. అయినా చేసేది ఏమీ ఉండదు.

ఎందుకంటే జగన్ మెచ్చి వారికి టికెట్లు ఇస్తే అడిగేందుకు కూడా ఎవరికీ ఏ రకమైన హక్కూ ఉండదనే అంటునారు. ఇలా అధికారులు కొందరు పొలిటికల్ రూట్లో ఉండగా సమయం దగ్గరపడిన కొద్దీ మరికొందరు కూడా అదే రూట్లో ఉంటారని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఈ విధేయ బృందం సంఖ్య ఎంత ఎక్కువగా పెరిగితే అంతలా సిట్టింగుల సీట్లు చిరిగిపోయే ప్రమాదం ఉంది అంటున్నారు. అయినా అధినాయకత్వం మెచ్చిన వారే లీడర్ మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News