ఏపీలో మారిన‌ ముఖ చిత్రం.. 2022 కీల‌క ఘ‌ట్టాలు ఇవే!

Update: 2022-12-31 17:55 GMT
ఏపీలో రాజ‌కీయాల సంగ‌తి ఎలా ఉన్నా.. పాల‌న ప‌రంగా.. కొన్ని కీల‌క ఘ‌ట్టాలు చోటు చేసుకున్నాయి. 2022లో ప్ర‌థ‌మార్థంలో రాష్ట్రంలోని 13 జిల్లాల‌ను 26 జిల్లాలుగా మారుస్తూ.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం సంచ‌ల‌న‌మ‌నే చెప్పాలి. అదేస‌మ‌యంలో ఈ జిల్లాల ఏర్పాటుతో చోటు చేసుకున్న ప‌రిణామాలు కూడా అంతే సంచ‌ల‌నం సృష్టించాయి. కొత్త జిల్లాల‌కు పేర్ల విష‌యంలో ప్ర‌భుత్వం ఇరుకున ప‌డింది. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో రాయ‌చోటి కేంద్రంగా ఏర్పాటు చేసిన అన్న‌మ‌య్య జిల్లాలో ప్ర‌జ‌లు రోడ్డెక్కారు. రాజంపేట‌ను జిల్లా కేంద్రం చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టారు.

ఈ క్ర‌మంలో ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున రెడ్డి కుటుంబ స‌భ్యులు సీఎం జ‌గ‌న్‌పై చేసిన వ్యాఖ్య‌లు ప‌తాక శీర్షిక‌ల‌కు ఎక్కాయి. అయినా.. ప్ర‌భుత్వం ఈ జిల్లా కేంద్రాన్ని రాయ‌చోటిగానే కొన‌సాగించింది. మ‌రోవైపు.. అమ‌లాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన కోన‌సీమ జిల్లా పేరు విష‌యంలో ఏకంగా.. అగ్గి రాజుకుంది. డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాగా పేరు మారుస్తూ... స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం ద‌రిమిలా జిల్లాలో అగ్నికీల‌లు ఎగ‌సి ప‌డ్డాయి. మంత్రి పినిపే విశ్వ‌రూప్ స‌హా సొంత పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ల‌ను ఆందోళ‌న కారులు త‌గుల‌బెట్టారు. ఈ వివాదం రాష్ట్రాన్ని చివురుటాకులా వ‌ణికించేసింది.

మ‌రోవైపు.. దీనికి ముందు.. వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు త‌న సొంత కారు డ్రైవ‌ర్‌ను హ‌త్య చేసి(కుటుంబ స‌భ్యుల ఆరోప‌ణ‌) డ్రైవ‌ర్ ఇంటికే డోర్ డెలివ‌రీ చేయ‌డం.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఖిన్నుల‌ను చేసింది. ఈ కేసులో ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరు తీవ్ర వివాదంగా మారింది. ఇంకోవైపు.. ఉమ్మ‌డి కృష్నాజిల్లాను విడ‌దీసి విజ‌య‌వాడ కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు విశ్వ‌విఖ్యాత నట‌సార్వ‌భౌముడు ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఆ వెంట‌నే.. ఆయ‌న తీసుకువ చ్చిన ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరును రాత్రికి రాత్రి మార్చేసి.. డాక్ట‌ర్‌ వైఎస్సార్ హెల్త్ యూనివ‌ర్సిటీగా పేరు పెట్టారు. ఇది రాజ‌కీయ దుమారానికి, ర‌చ్చ‌కు దారితీసింది.

ఇక‌, ఇదే సంవ‌త్సరం.. వైసీపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు ఎమ్మెల్యే ఐటీ మంత్రి మేక‌పాటి గౌతం రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. దుబాయ్‌లో పారిశ్రామిక స‌దస్సుకు హాజ‌రైన ఆయ‌న తిరిగి హైద‌రాబాద్‌కు చేరుకున్న కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే క‌న్నుమూయ‌డం.. వైసీపీనే కాకుండా.. అన్ని రాజ‌కీయ పార్టీల‌ను విస్మ‌యానికి, విషాదానికి గురి చేసింది. ఇక‌, సీఎం జ‌గ‌న్ కుటుంబానికి చెందిన వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు విచార‌ణ‌ను సుప్రీం కోర్టు తెలంగాణ రాష్ట్రానికి బ‌దిలీ చేసింది. రాష్ట్ర పోలీసుల‌పై త‌న‌కు న‌మ్మ‌కం లేద‌న్న ఆయ‌న కుమార్తె డాక్ట‌ర్ సునీత అభ్య‌ర్థ‌న‌ను సుప్రీంకోర్టు సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించి.. కేసును బ‌దిలీచేయ‌డం.. సీఎం జ‌గ‌న్‌కు మాయ‌ని మ‌చ్చ‌గా మారింద‌నే విశ్లేష‌ణ‌లు అప్ప‌ట్లో వ‌చ్చాయి.

ఇవ‌న్నీ.. ఇలా ఉంటే.. ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే రెండున్నరేళ్ల తర్వాత జగన్ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు పూనుకోవడం వైసీపీలో కీలక పరిణామంగా చెప్పవచ్చు. అయితే.. ఎవరూ ఊహించని విధంగా కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, కన్న బాబు, ఆళ్ల నాని వంటి వీర విధేయులకు జగన్ ఉద్వాసన పలకడం మంత్రి పదవులు కోల్పోయిన సదరు ఎమ్మెల్యేలకు కూడా షాకిచ్చిందనే చెప్పాలి. ఆ పరిణామం తర్వాత కొత్త మంత్రివర్గం ఖరారైంది. అయితే, పాత మంత్రివర్గంలో మొత్తం అందరినీ తీసేస్తామని ప్రకటించిన జ‌గ‌న్ ఏకంగా 11 మందిని మళ్లీ మంత్రులుగా కొన‌సాగించాల్సి రావ‌డం కొస‌మెరుపు!!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News