జగన్ బలం వారే చెబుతున్నారు... అందుకే డేరింగ్ గా...!

Update: 2023-01-10 01:30 GMT
జగన్ అంటే మూడు అక్షరాలు కాదు ముప్పయ్యేళ్ళ సీఎం అని ఆ పార్టీ నాయకులు అభిమానంగా అంటారు. జగన్ అంటే సింహం అని గొప్పగా చెబుతారు. సింహం సింగిల్ గా వస్తుంది జగన్ కూడా అంతే అని పోలిక తెస్తారు. నిజానికి జగన్ గుండె చాలా పెద్దది అని సొంత పార్టీ వారితో పాటు ప్రత్యర్ధులు అంగీకరిస్తారు.

జగన్ 2009లో కాంగ్రెస్ ఎంపీ అయ్యారు. 2010లో అదే పార్టీని వదిలేశారు. 2011లో ఒంటరిగా కాంగ్రెస్ ని ఢీ కొట్టారు. నాడు కేంద్రంలో బలంగా యూపీయే సర్కార్ ఉంది. సోనియా గాంధీ లాంటి శక్తివంతురాలు అయిన లీడర్ ని కేంద్రంలోనూ ఏపీలో చంద్రబాబుని నాటి కాంగ్రెస్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఎదిరించి సత్తా చాటిన జగన్ కి ఒంటరి పోరాటమే ఎపుడూ ఇష్టం. ఆ గట్స్ ఆయనకు కలసి వస్తాయని అన్న వారూ ఉన్నారు.

ఇక జగన్ బలం ఒరిజినల్ గా ఎంత అన్నది ఒక చర్చగా తీసుకుంటే వైసీపీకి 2014 నాటికి 45 శాతం దగ్గరగా ఓట్ల షేరింగ్ ఉంది. 2019 నాటికి అది యాభై శాతం ఓట్ల షేర్ గా మారింది. ఇక గతంలో బీసీలు కాపులలో పెద్ద ఎత్తున ఓటర్లు జగన్ వైపు లేరు. మరి 2019 తరువాత చూస్తే జగన్ బలం బీసీలలో విస్తరించింది అని అంటున్నారు. అలాగే కాపులలో కూడా వైసీపీ మార్క్ ఓటింగ్ ఉందని చెబుతున్నారు. మరి కొత్తగా వచ్చిన బలంతో పాటు ఏపీలో మూడున్నరేళ్ళుగా తుచ తప్పకుండా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల 80 శాతం ప్రజానీకం కోటిన్నరకు పైగా కుటుంబాలు లబ్ది పొందుతున్నాయని వైసీపీ వారు లెక్కలు తీస్తున్నారు.

ఇంతే కాదు సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షా పాతిక వేల మందికి కొత్తగా ఉద్యోగాలు సృష్టించారని, మరి వారి కుటుంబాలు కూడా తమ వైపు ఉండకుండా పోతారా అని కూడా అంటున్నారు. ఇలా ఏపీలో చూస్తే వైసీపీ పెట్టిన కొత్తలో సంస్థాగతంగా అంతగా బలం లేదని, కేవలం వైఎస్సార్ పేరు చెప్పుకునే జనంలోకి వెళ్ళేదని, ఇపుడు అలా కాదు జగన్ మార్క్ ఉందని, పైగా బూత్ లెవెల్ వరకూ పార్టీ పటిష్టంగా ఉందని అంటున్నారు.

దాంతో పాటు పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకూ వైసీపీ ప్రజా ప్రతినిధులు అడుగడుగునా ఉన్నారని, ఈ రోజుకీ 175 సీట్లకు పోటీ పెట్టగల దమ్ముతో పాటు ఒక్కో సీటుకు నలుగురైదురులు అభ్యర్ధులు పోటీలో ఉన్న పెద్ద పార్టీగా వైసీపీ ఉందని అంటున్నారు. ఇక విపక్షం నుంచి ఒక పద్ధతి ప్రకారం ఏపీ రాజకీయాలను అధ్యయనం చేస్తూ వస్తున్న జగన్ తెలుగుదేశం ఓడిపోగానే ఆ పార్టీ ఆర్ధిక మూలల మీద గట్టిగా దెబ్బ కొట్టారని, ఇపుడు తెలుగుదేశానికి చూస్తే గెలుపు మీద అంత నమ్మకం లేదని అంటున్నారు.

పైగా 40 నియోజకవర్గాలలో అభ్యర్ధులే లేరని కూడా గుర్తు చేస్తున్నారు. తెలుగుదేశానికి గెలుపు మీద నమ్మకం లేకనే పొత్తుల బాట పడుతోందని కూడా అంటున్నారు. మరో వైపు జనసేన తెలుగుదేశం కలసినా కూడా 2014లో జస్ట్ అయిదు లక్షల ఓట్ల తేడాతోనే తాము ఓడామని గుర్తు చేస్తున్నారు. ఇపుడు అంతకంటే పదింతలు పటిష్టంగా ఉన్నామని పైగా అధికారంలో ఉన్నామని కూడా చెబుతున్నారు. జగన్ని ఓడించడం కష్టమని తేలడంతోనే విపక్షాలు ఏకం అయ్యాయని ఆ విషయం వారే జనంలో ప్రచారం చేసుకోవడం ద్వారా వైసీపీ బలం విజయం ఏంటో చాటి చెబుతున్నారని కూడా అంటున్నారు.

ఈ రోజుకీ జగన్ మార్క్ వ్యూహాలు ఆయనకు ఉన్నాయని వై నాట్ 175 అన్నది జగన్ పట్టుదల మాత్రమే కాదు గట్టి నమ్మకమని, తాము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరోసారి పీఠం మీద కూర్చోబెడతాయని జగన్ ధీమాగా ఉన్నారు. ప్రతీ ఇంటికీ లక్షల రూపాయలు నేరుగా అందించి వారి జీవన పరిస్థితులను మెరుగుపరచిన వైసీపీకి కచ్చితంగా ఓట్లు పడతాయని, అది 2019 కంటే కూడా ఎక్కువ ఓట్ల షేర్ తో ఉంటుందని కూడా వైసీపీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూస్తే ఎంత మంది రానీ ఎన్ని పార్టీలు కలవని, అదే తమకు అంతగా ప్లస్ అవుతుంది అని చెబుతున్నారు.

ఈసారి ఏపీలో వైసీపీ గెలిచేది పాజిటివ్ ఓటింగ్ తో అని ఆ విషయం తెలియకుండా నెగిటివ్ ఓటింగ్ ని చీలకుండా అడ్డుకుంటామని విపక్షాలు కలవడం హాస్యాస్పదమని అంటున్నారు. 2019లో చంద్రబాబు వ్యతిరేక ఓటుని జనసేన విడిగా పోటీ చేసి చీల్చినా జనాలు వైసీపీకే పట్టం కట్టారని, ఇపుడు కూడా పాజిటివ్ ఓటింగ్ తమ వైపే అని గట్టి ధీమాతో జగన్ ఉన్నారని అంటున్నారు. సో పొత్తుల ఎత్తుల కంటే జగన్ మార్క్ వ్యూహాలే వైసీపీకి శ్రీరామరక్ష అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News