జగన్ చేతిలో బ్రహ్మాస్త్రం... విపక్షం చెల్లా చెదురే...?

Update: 2022-12-27 01:30 GMT
అధికారంలో ఉన్న వారికి చివరి నిముషం వరకూ అవకాశాలు ఉంటాయి. విపక్షంలో ఉన్న వారు జనాలతో కనెక్ట్ కావాలీ వారికి తమ గురించి చెప్పుకోవాలీ అంటే ఎన్నో రకాలైన ఇబ్బందులు ఉంటాయి. తీరా చెప్పినా వారు అధికారంలోకి వస్తారా రారా అన్న అపనమ్మకం కూడా ఉంటుంది. ఇక విషయానికి వస్తే ఏపీలో జగన్ని మళ్ళీ అధికారంలోకి రానీయకూడదు అని విపక్షం గట్టి పట్టుదలగా ఉంది.

ఎన్నికల వేళకు కూటమి కట్టి బలంగా జగన్ని ఢీ కొనే అవకాశాలు ఉన్నాయి అని కూడా అంటున్నారు. ఈ నేపధ్యంలో విపక్షం ఎత్తులను చిత్తు చేసి పై చేసి సాధించేందుకు అధికార పక్షం చూడడం సహజం. జగన్ కూడా అదే చేస్తారు. చేయాలి కూడా. ఆయన తన రాజకీయ వ్యూహాలతో పాటు అధికార బలాన్ని కూడా ఉపయోగించుకోబోతున్నారు అని తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల వేళకు సంపూర్ణ మద్య పాన నిషేధం ప్రకటిస్తారని అంటున్నారు. వైసీపీ ఇన్నర్ సర్కిల్స్ లో దీని మీద వాడి వేడిగా చర్చ సాగుతోంది. జగన్ 2019 ఎన్నికల వేళ దశల వారీగా మద్య పాన నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక మద్యం ధరలు భారీగా పెంచారు. అదే టైం లో కొత్త రకం బ్రాండ్లను కూడా ఏపీకి పరిచయం చేశారని విమర్శలు ఎదుర్కొన్నారు,

జగన్ ఒక చేతితో అమ్మ ఒడి పధకానికి డబ్బులు వేస్తూ నాన్న బుడ్డీ పేరిట భారీగా దోచుకుంటున్నారు అని విమర్శలు చేస్తోంది విపక్షం. మరి వారందరికీ చెక్ చెప్పేలా తన పాదయాత్ర హామీని నెరవేర్చుకునేలా 2024 ఎన్నికల వేళకు సంపూర్ణ మద్య పాన నిషేధాన్ని అమలు చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే అత్యంత సాహసోపేతమైన నిర్ణయంగానే చూడాలి. ఏపీ ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది.

మరో వైపు జగన్ పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నారు. వీటికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తుంది అన్న ప్రశ్న ఉండనే ఉంది. అలాగే కరోనా వల్ల ఏపీ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది అని కూడా కళ్ళకు కనిపిస్తున్న వాస్తవం. ఈ నేపధ్యంలో ఏటా పాతిక వేల కోట్ల రూపాయల ఆదాయం ఖజానాకు అప్పనంగా వచ్చే మద్యం అమ్మకాలను వదులుకుని సంపూర్ణ నిషేధం విధించాలీ అంటే మాత్రం అది సాహసం అని అంటున్నారు.

దీని వల్ల ఏపీ ఆర్ధికంగా కూడా ఇబ్బందులో పడుతుంది అని అంటున్నారు. అయితే దీని వల్ల రాజకీయంగా మాత్రం వైసీపీకి ప్రయోజనం నెరవేరుతుంది అని అంటున్నారు. ఏపీలో పెద్ద ఎత్తున ఉండే మహిళా ఓటర్లు వైసీపీ వైపుగా టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాలను నమ్ముకున్న జగన్ సోషల్ ఇంజనీరింగ్ ద్వారా కూడా ఏపీలో తనదే పై చేయిగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇపుడు బ్రహ్మాస్త్రం లాంటి మద్య నిషేధం హామీని ఇస్తే మాత్రం వైసీపీకి భారీ అడ్వాంటేజ్ అవుతుంది అన్న చర్చ ఉంది.

ఇక 1994 ఎన్నికలకు ముందు అప్పటి తెలుగుదేశం నాయకుడు ఎన్టీయార్  సైతం సంపూర్ణ మద్య పాన నిషేధం అమలు చేశారు. అయితే ఆయన తరువాత వచ్చిన చంద్రబాబు దాన్ని మధ్యలో ఎత్తేశారు. అందువల్ల జగన్ కనుక దాన్ని అమలు చేస్తే మాత్రం ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా తనకు రాజకీయ లాభంతో పాటు విపక్షాల పాలిట అది బ్రహ్మాస్త్రమే అవుతుంది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News