వృధా ఖ‌ర్చు పెట్టార‌ని ఆ ప్ర‌ధానిని క‌డిగేస్తున్నారు!!

Update: 2018-09-05 10:32 GMT
రెండు రాష్ట్రాల్లోని తెలుగు వారు త‌ప్ప‌నిస‌రిగా చ‌ద‌వాల్సిన వార్త ఇది. ప్ర‌జా సొమ్మును ఎంత జాగ్ర‌త్త‌గా.. ఆచితూచి ఖ‌ర్చు చేయాలో చెప్ప‌ట‌మే కాదు.. ప్ర‌జా ధ‌నాన్ని వృధా చేసే ప్ర‌భుత్వాల్ని ఏ మాత్రం స‌హించ‌కూడ‌ద‌న్న విష‌యం ఈ వార్త స్ప‌ష్టం చేస్తుంది. న్యూజిలాండ్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం చ‌దివిన‌ప్పుడు త‌మ వ్య‌క్తిగ‌త ఇష్టాయిష్టాల‌తో వంద‌ల కోట్ల‌ను వృధా చేసే మ‌న చంద్రుళ్లు ఇద్ద‌రు చ‌ప్పున గుర్తుకు రావ‌టం ఖాయం.

న్యూజిలాండ్ కు మ‌హిళా ప్ర‌ధాని బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఆమె పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌ను ఇవ్వ‌ట‌మే కాదు.. త‌మ బిడ్డ‌కు పాలు ఇవ్వ‌టం ప‌లువురిలో స్ఫూర్తిని రేకెత్తించింది. అంతేనా.. ఆ దేశ రెండో మ‌హిళా ప్ర‌ధానిగా ఆమె రికార్డుల్లోకి ఎక్కింది. ఇలాంటి ఆమెపై తాజాగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దేశ ప్ర‌ధాని వృధా ఖ‌ర్చుపై అక్క‌డి ప్ర‌జ‌లు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఎందుకంటే..ఇటీవ‌ల త‌న బిడ్డ‌కు పాలివ్వ‌టానికి వీలుగా ఆమె చేసుకున్న ఏర్పాటుతో రూ.35ల‌క్ష‌ల ప్ర‌జాధ‌నం వృధా కావ‌ట‌మే.

నిజానికి ఆ ఖ‌ర్చు కూడా ఆమె కావాల‌ని చేసింది కాదు. అయిన‌ప్ప‌టికీ అక్క‌డి ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. అవ‌స‌ర‌మైతే ప్ర‌యాణం మానుకోవ‌చ్చు క‌దా? అని మొహ‌మాటం లేకుండా క‌డిగేస్తున్నారు. న్యూజిలాండ్ ప్ర‌ధాని జెసిండా ఆర్డ‌ర్న్ నౌరులో జ‌రగ‌నున్న ప‌సిఫిక్ ఐస్ ల్యాండ్స్ స‌మ్మిట్ కి వెళ్లారు. త‌న‌తో పాటు త‌న చిన్నారి బుజ్జాయిని కూడా తీసుకెళ్లారు. ఈ స‌మ్మిట్ కు ప్ర‌ధానితో పాటు.. ఉప ప్ర‌ధాని విన్ స్ట‌న్ పీట‌ర్స్ కూడా హాజ‌ర‌య్యారు. ఒకే కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని.. ఉప  ప్ర‌ధాని బ‌య‌లుదేరినా.. బిడ్డ‌కు పాలు ఇవ్వ‌టానికి ఇబ్బందికి గురి కాకుండా ఉండేందుకు వీలుగా.. ఇద్ద‌రునేత‌లు వేర్వేరుగా విమానాల్ని ఉప‌యోగించారు.

ఈ కార‌ణంగా దేశ ఖ‌జానాపై రూ.35ల‌క్ష‌ల అద‌న‌పు ఖ‌ర్చు అయ్యింది. దీనిపై ఒక క‌థ‌నాన్ని హెరాల్డ్ ప‌త్రిక క‌థ‌నం అచ్చేసింది. ఇది కాస్తా సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. ఆ దేశ పౌరులు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత డ‌బ్బు ఖ‌ర్చు చేసి మీరిద్ద‌రూ ఒకే కార్య‌క్ర‌మానికి హాజ‌రుకాకుండా.. ఒక‌రే వెళితే ఏమైంది? అని సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు. త‌ల్లిగా పాలు ఇవ్వ‌టానికి ఇబ్బందిగా ఉంటే.. మీ బ‌దులు ఉప ప్ర‌ధాని ఒక్క‌రిని పంపితే స‌రిపోయేది క‌దా? అని నిల‌దీస్తున్నారు.

త‌న‌పై పెరుగుతున్న విమ‌ర్శ‌ల‌పై ప్ర‌ధాని జెసిండా రియాక్ట్ అయ్యారు. తన కార‌ణంగా వృధా ఖ‌ర్చు అయ్యింద‌ని విమ‌ర్శిస్తున్న వారు ఎందుకు వెళ్లాల‌ని ప్ర‌శ్నిస్తున్నార‌ని.. ఒక‌వేళ తాను కానీ వెళ్ల‌కుండా ఉంటే.. సాకులు చూపించి ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స‌రిగా నిర్వ‌ర్తించ‌టం లేద‌ని త‌ప్పు ప‌ట్టేవార‌న్నారు. అందుకే త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల్ని ప‌ట్టించుకోన‌ని చెప్పారు.

ఇక్క‌డ చెప్పొచ్చేదేమంటే.. అంత అభివృద్ధి చెందిన దేశంలో రూ.35 ల‌క్ష‌ల మొత్తానికి ఇంత రార్ధాంతం జ‌రిగితే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పెట్టే అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చులు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చేప‌ట్టే ప్ర‌జా నివేద‌న లాంటి కార్య‌క్ర‌మాల కోసం వెచ్చించే ప్ర‌జాధ‌నం లెక్క‌ల్ని చూసి కూడా పెద్ద‌గా రియాక్ట్ కాని తీరు చూస్తే.. ఇద్ద‌రు చంద్రుళ్లు ఎంత ల‌క్కీనో క‌దూ?
Tags:    

Similar News