కొత్త లెక్కలు.. దేశంలో నిమిషంలో పుట్టే వారెందరు? గిట్టే వారెందరంటే?

Update: 2021-06-19 04:30 GMT
దేశ జనాభాకు సంబంధించిన కొత్త లెక్కలు బయటకు వచ్చాయి. దేశంలో మొత్తం జనాభా ఎంత? జననాలు ఎన్ని? మరణాలు ఎన్ని? యావత్ దేశంలో నిమిషం గడిచేసరికి పుట్టే వారెందరు? గిట్టే వారెందురు? లాంటి అన్ని లెక్కలు తాజాగా వెల్లడించారు. తాజా లెక్కల ప్రకారం దేశ జనాభా 133.89 కోట్లకు చేరింది. సగటున నిమిషానికి 51 మంది పుడుతుంటే.. పదహారు మంది మరణిస్తున్నారు.

2019 జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకు దేశం మొత్తమ్మీదా అధికారికంగా నమోదైన లెక్కల్ని పరిగణలోకి తీసుకొని గణాంకాల్ని సిద్ధం చేశారు. ఏడాదిలో దేశ వ్యాప్తంగా పుట్టిన వారు 2.67 కోట్ల మంది ఉంటే.. మరణాలు 83 లక్షలు ఉన్నాయి. దేశంలో నమోదైన ప్రసవాల్లో 81.2 శాతం ప్రభుత్వ.. ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగాయి.

ఏడాది వ్యవధిలో మరణించిన 83.01 లక్షల మరణాల్లో 34.5 శాతం మందికి మరణించే సమయంలో ఎలాంటి వైద్య సదుపాయాలు అందకపోవటం గమనార్హం. ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతూ మరణించిన వారు 32.1 శాతం మిగిలిన మరణాలు ఇతర కారణాలతో చోటు చేసుకున్నాయి. ఇక పుట్టిన వెంటనే కన్నుమూసిన శిశువులు 1.65 లక్షలుగా తేలింది. వీరిలో 75 శాతం పట్టణాలకు చెందిన వారు కాగా.. 24 శాతం గ్రామాలకు చెందిన వారు.

దేశంలో జననాలు.. మరణాల మధ్య అంతరం పెరిగింది. 20 ఏళ్ల వ్యవధిలో118 శాతం అదనంగా జననాలు చోటు చేసుకున్నాయి. 1999లో దేశంలో 1.22 కోట్ల మంది పుడితే.. సరిగ్గా పదేళ్ల తర్వాత 2019లో 2.67 కోట్ల మంది పుట్టారు. అంటే.. జననాల పెరుగుదల 118 శాతం ఉండటం గమనార్హం. అదే సమయంలో మరణాల్లో కూడా పెరుగుదల నమోదైంది. 1999లో 36.23 లక్షల మంది మరణిస్తే.. 2019లో 83 లక్షల మంది మరణించటం గమనార్హం.
Tags:    

Similar News