ఎవరెస్ట్​ ఎత్తు పెరిగిందా? చైనా.. నేపాల్​ పంచాయితీ.. త్వరలో అధికారిక ప్రకటన

Update: 2020-11-28 03:30 GMT
ఎవరెస్ట్​ శిఖరం ఎత్తు పెరిగినట్టు సమాచారం. ఇప్పటికే పలు సర్వే సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి. కానీ ఈ విషయంపై ఇప్పటికైతే నేపాల్​ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. ఎవరెస్ట్ ఎత్తు  గతం కంటే ఎంత పెరిగింది.. అనే విషయంపై  త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం. నేపాల్​, చైనా కలిసి ఈ సంయుక్త ప్రకటన చేయనున్నాయి.  బుధవారం జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో ఎవరెస్టు కొత్త ఎత్తుని ప్రకటించేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖకు అంగీకారం లభించింది. 2015 భూకంపం తర్వాత ఎవరెస్ట్​ ఎత్తు మారి ఉంటుందని సమాచారం. దీంతో నేపాల్​ ప్రభుత్వం 2017లో ఎవరెస్టు ఎత్తును కొలిచే ప్రక్రియ ప్రారంభించింది.

‘మేము ఇప్పటికే ఎవరెస్ట్​ ఎత్తును కొలిచాం. మరికొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తాం’ అని నేపాల్​ భూగర్భశాఖ మంత్రి పద్మ కుమారి చెప్పారు. ఎవరెస్ట్​ ఎత్తును ఇప్పటికే భారత్​ కొలిచింది. 1954లో మనదేశం చేపట్టిన సర్వే ఆధారంగా ఎవరెస్టు ఎత్తు 8,848 మీటర్లు. (29,029 అడుగులు). అయితే ఈ భారత్​ చెప్పిన ఎత్తుతో చైనా, నేపాల్​ దేశాలు విభేదిస్తున్నాయి. ఎవరెస్ట్​కు ఉత్తరదిశలో ఉన్న టిబెట్​ వైపు నుంచి చైనా ఎత్తును లెక్కగట్టింది. కేవలం రాతి ఎత్తునే అది పరిగణనలోకి తీసుకున్నది.

 చైనా చెబుతున్న లెక్కల ప్రకారం (2015)  ఎత్తు 8844.04 మీటర్లు. అయితే ఎవరెస్ట్​ పైన ఉన్న మంచుపొర కూడా పరిగణనలోకి తీసుకోవాలని నేపాల్​ వాదిస్తున్నది. గతంలో ఈ విషయంపై చైనా , నేపాల్​ ఓ అంగీకారానికి వచ్చాయి. మంచుపొరను కూడా లెక్కించేందుకు చైనా ఒప్పుకున్నది. దీంతో ఇప్పుడు ఇరు దేశాలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేయనున్నాయి.
Tags:    

Similar News