అక్కడ ఏం చేస్తున్నారో.. అందరికీ తెలియాలి: చంద్రబాబు ఫోన్
ఏపీలోని కూటమి సర్కారులో మంత్రులుగా ఉన్న కొందరు.. ప్రభుత్వ నిర్ణయం మేరకు సింగపూర్‌లో పర్యటిస్తున్నారు.;
ఏపీలోని కూటమి సర్కారులో మంత్రులుగా ఉన్న కొందరు.. ప్రభుత్వ నిర్ణయం మేరకు సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. ఇది వారం రోజుల పర్యటన. త్వరలోనే ముగియనుంది. సింగపూర్‌లో పరిపాలన.. ప్రజల సమస్యల పరిష్కారం.. అభివృద్ధిలో ఎలాంటి అడుగులు వేస్తున్నారు. శాఖల పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారులకు-మంత్రులకు మధ్య సమన్వయం.. ఇలా అనేక అంశాలపై అధ్యయనం చేసేందుకు.. కొన్ని రంగాల్లో శిక్షణకు మంత్రులు వెళ్లారు.
వీరిలో హోం మంత్రి అనిత, పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ సహా.. పలువురు ఆయా శాఖల అదికారులు కూడా ఉన్నారు. గత నాలుగు రోజులుగా సింగపూర్ ప్రభుత్వం చేస్తున్న పనులు, అధికారులతో సమన్వయం.. వంటి అంశాలపై అధ్యయనం చేస్తున్నారు.
అయితే.. ఈ పర్యటనకు సంబంధించి తాజాగా ఓ మీడియా సంచలన కథనం వచ్చింది. అనవసరంగా నిధులు వృథా చేస్తున్నారని.. సింగపూర్‌కువెళ్లి నేర్చుకునేది ఏముందని ఈ కథనం సారాంశం. అంతేకాదు..మన దేశంలోనే అనేక మంది మేధావులు ఉన్నారని.. వారి ద్వారా నేర్చుకోవచ్చు కదా.. అని ముక్తాయించారు. మొత్తంగా 3 కోట్ల రూపాయలను వృథా చేస్తున్నారని ఆక్షేపించారు. ఈ కథనం ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపింది. దీనిపై చంద్రబాబు స్వయంగా దృష్టి పెట్టారు.
ఆ వెంటనే సింగపూర్‌లో ఉన్న మంత్రుల బృందానికి నేతృత్వం వహిస్తున్న మంత్రి నారాయణకు ఫోన్ చేసి.. అక్కడ ఏం చేస్తున్నారో.. అందరికీ తెలియాలని.. ఆదేశించారు. నిర్దేశిత లక్ష్యాల సాధనే ప్రామాణికం గా పర్యటన ఉండాలని పేర్కొన్నట్టు తెలిసింది. అంతేకాదు.. సింగపూర్ మోడల్‌ను ఎందుకు ప్రాధాన్యంగా తీసుకున్నదీ ఆయన వివరించారు. అన్ని రంగాల్లోనూ అబివృద్ధి చెందుతున్న సింగపూర్ నుంచి అనేక దేశాలు తెలుసుకునే పలు అంశాలు ఉన్నాయని కూడా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో వారికి ఫోన్ చేసి వివరించారు.