నాసిరకంగా నాడు-నేడు.. విద్యార్థుల ప్రాణాలకే ఎసరు?

Update: 2021-09-02 06:30 GMT
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నాడు-నేడు’ పనులతో విద్యార్థుల తలలు పగిలిపోతున్నాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. పనులపై పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు నాసిరకం పనులు చేస్తున్నారు. దీంతో స్కూలు భవనాల్లో చేపట్టిన ఈ పనులతో విద్యార్థుల ప్రాణాలు పోతున్నాయి. మొన్న ప్రకాశం జిల్లాలో.. నేడు కడప జిల్లాలో ఒకే రకమైన ప్రమాదాలు జరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తెలిసీ తెలియని వయసులో ఉన్న అమాయక విద్యార్థులు ఉంటే పాఠశాల భవనాలను నాణ్యతతో నిర్మించాలన్న కనీస ధ్యాస లేకుండా పనులు చేపట్టడంతో అవి నిర్మాణ దశలోనే కూలిపోతున్నారు. ఓ వైపు పాఠశాలలు నడుస్తూ ఉండగానే మరోవైపు ఈ పనులు కొనసాగిస్తుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.

దాదాపు 16 నెలల తరువాత స్కూళ్లు ఇటీవలే ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ తో మూతపడిన విద్యాసంస్థలు ఎట్టకేలకు ఇటీవలే తెరుచుకున్నాయి. మొన్నటి వరకు ఆన్లైన్లోనే క్లాసులు విన్న విద్యార్థులు ఇక ప్రత్యక్షంగా పాఠాలు వింటున్నారు. అయితే ఇన్ని రోజులు ఇళ్లల్లో ఉండి మానసికంగా కుంగిపోయిన విద్యార్థులను భయ భయంగానే తల్లిదండ్రులు స్కూళ్లకు పంపుతున్నారు. చిన్న వయసులోనే మాస్కులు ధరించి క్లాసులో కూర్చోవడం విద్యార్థులకు పెద్ద పరీక్షే. అయినా భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు ధైర్యం చేసి తమ పిల్లలను స్కూళ్లకు పంపుతున్నారు.

చాలా మంది వైరస్ కు భయపడి తమ పిల్లలను ఇళ్లలోనే ఉంచుతున్నారు. ప్రభుత్వం అన్ని తరగతుల తరగతులు ప్రారంభించుకోవడానికి అనుమతి ఇచ్చినా 3వ తరగతిలోపు విద్యార్థుల తల్లి దండ్రులు మాత్రం స్కూళ్లకు పంపడం లేదు. గత సంవత్సరం ఇలాగే పాఠశాలలకు పంపడం వల్ల చాలా మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఆ తరువాత సెకండ్ వేవ్ విజృంభించిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి కొన్నిరోజులు వేచి చూడాలని అంటున్నారు. అయినా కొందరు తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను పాఠశాలలోనే భవిష్యత్ అనుకొని స్కూళ్లకు పంపుతున్నారు.

ఓ వైపు కరోనా భయం ఇంకా తొలిగిపోకముందే మరోవైపు పాఠశాల భవనాల ప్రమాదాలు వరుసగా జరుగుతుండడంతో తల్లిదండ్రులకు ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘నాడు-నేడు’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిని జాతికి అంకితం చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా శిథిలావస్థలో ఉన్న భవనాలను ఆధునీకరించడం, స్కూల్ ఆవరణణు పరిశుభ్రంగా తయారు చేయడం వంటివి చేస్తున్నారు.

ప్రభుత్వ రూపురేఖలు మార్చడం కోసం చేస్తున్న పనులు నాసిరకంగా ఉంటున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా సి. బెళగల్ మండలం బురాన్ దొడ్డి ప్రాథమిక పాఠశాలలో భవనం లోపల పెచ్చులూడి విద్యార్థులపై పడింది. 5వ తరగతి క్లాసులు వింటున్న పిల్లలపై ఒకేసారి స్లాబు పడడంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మహీధర్ అనే విద్యార్థికి తలపగిలింది. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా ఐదు కుట్లు పడ్డాయి. గతనెల 29న ప్రకాశం జిల్లా మార్కపురం మండలం రాజుపాలెంలోనూ ఇదే సంఘటన జరిగింది. విద్యార్థులంతా స్కూల్ ఆవరణలో ఆడుకుంటుండగా విష్ణు అనే 7వ తరగతి విద్యార్థి క్లాస్ రూంలో కూర్చున్నాడు. అదే సమయంలో పైకప్పు కూలి అతని తలపై పడింది. అతన్ని పెద్దలు గమనించేలోపే విద్యార్థి మృతి చెందాడు. అయితే విద్యాశాఖ మంత్రి సొంత జిల్లాలో ఈ సంఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. వారం రోజుల్లో రెండు చోట్ల ఇలాంటి ప్రమాదాలు జరగడంపై నాడు-నేడు పనులపై విమర్శలు వస్తున్నాయి. ఈ పనుల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా నాసిరకంగా ఉండడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు.


Tags:    

Similar News