5 నుంచి కాంగ్రెస్ దేశ‌వ్యాప్త నిర‌స‌న‌లు.. ఎన్నిక‌ల ముందు బ‌లం పుంజుకునేనా?

Update: 2022-07-31 10:30 GMT
ఆగ‌స్టు 5 నుంచి దేశ‌వ్యాప్త నిర‌స‌న‌ల‌కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దేశంలో విప‌రీతంగా పెరుగుతున్న ధ‌ర‌లు, నిరుద్యోగం, భారత సైన్యంలో అగ్నిప‌థ్ స్కీమ్ ప్ర‌వేశ‌పెట్ట‌డం, నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌పైనా జీఎస్టీ విధించ‌డం, కేంద్ర సంస్థ‌ల‌ను వాడి ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను వేధించ‌డం వంటివాటిపై కాంగ్రెస్ పార్టీ దేశ‌వ్యాప్త నిర‌స‌న‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ మేర‌కు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేసీ వేణుగోపాల్ ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీల‌ నేతలకు దీనిపై ఆదేశాలు జారీ చేశారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యం కూడా లేదు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు సాధించ‌డ‌మే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ప‌న్నుతోంది. కేంద్రంలోని న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వంపై అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తి ఉంద‌ని ఆ పార్టీ భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో మోదీ ప్ర‌భుత్వాన్ని ఎలాగైనా గ‌ద్దె దించాల‌ని త‌ల‌పోస్తోంది. మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌కు శ్రీకారం చుట్ట‌బోతున్నారు. దేశ‌వ్యాప్త నిర‌స‌న‌లు, భార‌త్ జోడో యాత్ర‌తో పార్టీ బ‌ల‌ప‌డుతోంద‌ని కాంగ్రెస్ పార్టీ విశ్వ‌సిస్తోంది.

మోదీ ప్ర‌భుత్వ విధానాలతో దేశంలో అన్ని ర‌కాల‌ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయ‌ని అంటున్నారు. నిత్యావ‌స‌ర స‌రుకులు.. పప్పులు, వంట నూనెలు, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి భారంగా మారాయ‌ని కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శ‌లు చేస్తోంది. దీనికి తోడు చేపలు, పాలు, పెరుగు ప్యాకెట్లు, 25 కిలోలు అంత‌కంటే తక్కువ ఉన్న బియ్యం బ్యాగులు, గోధుమ పిండి, తేనె వంటి వివిధ ఉత్పత్తులపై జీఎస్టీ విధించార‌ని మండిప‌డుతోంది.

ఇక గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం భారీగా పెరిగిపోయింద‌ని కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోంది. అగ్నిపథ్ స్కీమ్ ను ప్ర‌వేశ‌పెట్టి భార‌త సైన్యంలోకి చేరాల‌నుకున్న యువ‌త ఆశ‌ల‌ను బీజేపీ ప్ర‌భుత్వం నాశ‌నం చేసింద‌ని ఆరోపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే మోదీ ప్ర‌భుత్వ‌ నిర్ణయాలపై పోరాటాన్ని తీవ్రతరం చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే వ‌ర్షాకాల పార్ల‌మెంటు స‌మావేశాల్లో భాగంగా బీజేపీ ప్ర‌భుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోంది.

ఆగ‌స్టు 5న జరగనున్న కాంగ్రెస్ నిరసనల్లో కాంగ్రెస్ తరఫున చట్ట సభలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులతోపాటు, రాష్ట్రాలు, జిల్లాల ఇంచార్జిలు, కార్యకర్తలు పాల్గొంటారు. గ్రామీణ స్థాయి నుంచి దేశ రాజధాని వరకు ఈ నిరసనలు జరుగుతాయిన కాంగ్రెస్ పార్టీ వెల్ల‌డించింది. నిర‌స‌న‌ల్లో భాగంగా రాష్ట్ర రాజధానుల్లో రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమం చేపడతారు.
Tags:    

Similar News