రాక్షసులకు ఉరి ఇక ఉండదా?

Update: 2016-02-10 04:39 GMT
పసిమొగ్గలపై దారుణ అత్యాచారాలు చేసే వారికి ఈ భూమి మీద బతికే అవకాశం ఇవ్వాలా? ఒకవేళ బతికే అవకాశం ఇస్తే.. ఆ నీచుడు బతకానికి అవసరమైన డబ్బును ప్రజలు పన్నుల రూపంలో చెల్లించాలా? దారుణమైన నేరాలకు పాల్పడే వారికి.. అమానుషంగా హత్యలు చేసే వారికి.. ఇలా ఘోరమైన నేరాలు చేసే ఎవరికి మరణశిక్ష అమలు చేయకూడదని కేంద్రం భావిస్తుందా? ఇందుకు తగ్గట్లు చట్టంలో కీలక మార్పులు చేసే అవకాశం ఉందా? అంటే అవుననే మాట బలంగా వినిపిస్తోంది.

ఇప్పటివరకూ పలు నేరాలకు విధించే మరణశిక్షను మార్చాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. జాతీయ న్యాయకమిషన్ సిఫార్సుల ఆధారంగా ఉరిశిక్షను రద్దు చేయాలని.. ఆ స్థానంలో యావజ్జీవ కారాగార శిక్షను విధించాలన్న సూచనకు కేంద్రం ఓకే చెప్పే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. అయితే.. దీనికి కూడా కొన్ని మినహాయింపులు పెట్టినట్లుగా తెలుస్తోంది. దేశంపై యుద్ధం ప్రకటించిన వారికి.. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన వారికి మాత్రమే ఉరిశిక్ష విధించాలన్న నిర్ణయాన్ని లా కమీషన్ సిఫార్సు చేసినట్లుగా తెలుస్తుంది. దేశం మీద యుద్ధం ప్రకటించిన వ్యక్తికి ఉరి సరే. మరి.. సమాజం మీద యుద్ధం ప్రకటించటం.. సమాజంలో మిగిలిన ప్రజలు ప్రశాంతంగా బతికే అవకాశం లేకుండా.. తమ విచ్చలవిడితనంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారికి బతికే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందా? అన్నదే పెద్ద ప్రశ్న.

ఇలాంటి ప్రశ్నకు చెప్పే సమాధానం ఏమిటంటే.. ప్రపంచంలోని140 దేశాల్లో మరణదండనను రద్దు చేశారని.. భారత్ తో సహా కేవలం 55 దేశాల్లోనే ఉరిశిక్ష అమలు అవుతుందని చెబుతున్నారు. న్యాయంగా మాట్లాడుకుంటే.. ఒక మనిషి జీవించే అవకాశాన్ని కాలరాచే వ్యక్తిని బతికించటానికి ఎందుకంత ఆరాటపడాలో అర్థంకాదు. అన్నెంపున్నెం ఎరుగని చిన్నారుల్ని అత్యంత కసాయితనంతో అత్యాచారం చేసే రాక్షసుల్ని బతికించి సాధించేదేముంది..?
Tags:    

Similar News