మోడీ కోసం స్పెషల్ ఫ్లైట్ కొంటారా? కొనరా?

Update: 2016-06-23 07:25 GMT
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో విదేశాంగ విధానాన్ని అమలు చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని మోడీ ఎంత ఫేమస్ అయ్యారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం రెండేళ్ల వ్యవధిలో 40 విదేశీ పర్యనటలు చేసి వచ్చిన ఆయన లాంటి నేతకు విమాన అవసరం ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాలికి చక్రాలు తగిలించుకున్నట్లుగా ప్రపంచ దేశాల్ని చుట్టి వస్తున్న ఆయన అవసరాలకు తగ్గట్లుగా సరికొత్త విమానాన్ని కొనుగోలు చేయాలని కేంద్రం భావిస్తోంది.

ఇందుకోసం అత్యాధునిక విమానాన్ని కొనాలని.. ఇది అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే ఎయిర్ ఫోర్స్ వన్ తరహాలో అత్యాధునిక సాంకేతికతతో ఉండాలని రక్షణ శాఖ భావిస్తోంది. దీనికి సంబంధించిన కీలక నిర్ణయం ఈ నెల 25న తుది నిర్ణయం తీసుకోనున్నారు. భారత  ప్రధానుల కోసం రెండు దశాబ్దాల నుంచి బోయింగ్ 747 విమానాన్ని ఉపయోగిస్తున్నారు. ఉగ్రవాదుల నుంచి భారీ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అత్యాధునిక సాంకేతికత ఉన్న విమానాన్ని మోడీ కోసం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందన్నది రక్షణ శాఖ ఆలోచన. ఇందులో భాగంగా బోయింగ్ 777-300 మోడల్ విమానాన్ని కొంటే ఎలా ఉంటుందన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు. విమానం కొనుగోలు విషయాన్ని కేంద్ర క్యాబినెట్ డిసైడ్ చేయనుంది. ఇదిలా ఉంటే.. మోడీ కోసం కొనాలని భావిస్తున్న విమానంలోని ప్రత్యేకతల విషయాన్ని చూస్తే..

= ప్రధాని కోసం ప్రత్యేక ఆఫీసు కార్యాలయం. ఫైవ్ స్టార్ వసతి కలిగిన బెడ్రూం.

= తాజా కమ్యూనికేషన్ సౌకర్యాలు.

= గ్రేనేడ్..రాకెట్ దాడులకు ధీటుగా ఎదుర్కొనే టెక్నాలజీ.

= శత్రువుల రాడార్ లను జామ్ చేయటం.. దారి మళ్లించే సామర్థ్యం.

= క్షిపణి వ్యతిరేక రక్షణ వ్యవస్థల ఏర్పాటు

= రాడార్.. క్షిపణి హెచ్చరిక వ్యవస్థతో పాటు.. బలమైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు.

= 2వేల మందికి ఆహారాన్ని నిల్వ ఉంచే సౌకర్యం.

= ఎమర్జెన్సీ సమయంలో ఆకాశంలోనే ప్యూయల్ నింపే సౌకర్యం

= ఎల్లవేళలా డాక్టర్లు అందుబాటులో ఉండటంతో పాటు.. అత్యవసర వైద్య చికిత్స.. శస్త్ర చికిత్స చేసేందుకు వీలుగా ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు

= బ్రాడ్ బ్యాండ్..రేడియో.. టెలిఫోన్ కనెక్షన్.. 19 టీవీ సెట్ లు.. అధికారులు పని చేయటానికి వీలుగా తగిన సౌకర్యాలు
Tags:    

Similar News