మీ పినాసి బుద్ధిని మ‌ళ్లీ చూపావుగా మోడీ!

Update: 2019-03-06 10:34 GMT
ప్ర‌ధాని స్థానంలో ఉన్న వ్య‌క్తి ఎంత ప‌వ‌ర్ ఫుల్?  అందులోకి భార‌త ప్ర‌ధానిగా వ్య‌వ‌హ‌రిస్తున్న మోడీ ఎంత ప‌వ‌ర్ ఫుల్ అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. స‌మకాలీన రాజ‌కీయాల్లో మోడీ శ‌క్తివంత‌మైన ప్ర‌ధానిగా ప‌లువురు అభివ‌ర్ణిస్తుంటారు.

మిగిలిన విష‌యాలు ఎలా ఉన్నా.. ఖ‌ర్చు విష‌యంలో.. అందునా ఎవ‌రికైనా.. ఏ వ‌ర్గానికైనా.. ఏ రాష్ట్రానికైనా ఏదైనా సాయం చేయాల‌న్నా.. నిధులు ప్ర‌క‌టించాల‌న్నా.. వ‌రాలు ఇవ్వాల‌న్న ఆయ‌న‌కు ఒక ప‌ట్టాన మ‌న‌సు రాద‌ని చెబుతారు. విభ‌జ‌న‌తో స‌ర్వం న‌ష్ట‌పోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ మీద ఎన్నిక‌ల వేళ‌లో అమిత‌మైన జాలిని ప్ర‌ద‌ర్శించిన మోడీ.. ప్ర‌ధాని అయ్యాక ఇచ్చిందేమీ లేదు. చివ‌ర‌కు ఏపీ రాజ‌ధాని శంకుస్థాప‌న‌కు వ‌చ్చిన సంద‌ర్భంలో రెండు బిందెల్ని తెచ్చి.. ఒక‌దాంట్లో మ‌ట్టి.. మ‌రోదాంట్లో నీళ్లును తేవటం ద్వారా త‌న పినాసిత‌నాన్ని యావ‌త్ భార‌తానికి తెలిసేలా చేశారు.

అలా అని ఆయ‌న అస్స‌లు ఖ‌ర్చు పెట్ట‌రా? అంటే అదేమీ లేద‌ని చెప్పాలి. ఆయ‌న నిత్యం ధ‌రించే డ్రెస్సుల‌కు పెట్టే ఖ‌ర్చ లెక్క‌లు కానీ.. ఆయ‌న విదేశీ ప్ర‌యాణాల కోసం చేసే ఖ‌ర్చులు కానీ.. ఇత‌ర‌త్రా భారీగానే ఉంటాయి. కానీ.. సాయం చేసే వేళ‌లోనే ఆయ‌న పొదుపుత‌నాన్ని ప్రద‌ర్శిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య‌మంత్రుల్ని చూస్తే.. తాము ఫ‌లానా వ‌ర్గానికి అనుకూలం.. వారి ప‌ట్ల త‌మ‌కు ఎంతో అభిమానం ఉందన్న విష‌యాన్ని చెప్ప‌టానికి కోట్లాది రూపాయిలతో వ‌రాలు ప్ర‌క‌టిస్తుంటారు.

సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు పెట్టే ఖ‌ర్చు మామూలుగా ఉండ‌దు. కానీ.. మోడీ కాస్త భిన్నం. ఖ‌జానాలో నుంచి డ‌బ్బులు తీయ‌కుండానే మ‌న‌సు దోచుకునే మాస్ట‌ర్ ప్లాన్లు వేస్తుంటారు. పారిశుద్ధ్య కార్మికులంటే త‌న‌కు ఎంత గౌర‌వమ‌న్న విష‌యాన్ని తెలియ‌జేయ‌టానికి.. కొంద‌రు పారిశుద్ధ్య కార్మికుల్ని పిలిపించి.. వారి కాళ్ల‌ను తానే స్వ‌యంగా క‌డిగేసి.. వంద‌ల కోట్ల రూపాయిల మైలేజీ సొంతం చేసుకున్నారు.

నిజంగా పారిశుద్ధ్య కార్మికుల మీద మోడీకి అంత ప్రేమే ఉంటే.. ప్ర‌ధాని హోదాలో దేశంలోని స‌ఫాయి కార్మికుల సంక్షేమం కోసం కార్య‌క్ర‌మాన్ని ప్ర‌వేశ పెట్ట‌టం.. వారికి ఉచిత బీమా సౌక‌ర్యం.. ఉచిత వైద్యం.. వారు మాన్యువ‌ల్ గా కాకుండా యంత్రాల సాయంతో ప‌నులు నిర్వ‌హించేలా.. ఇలా ఎన్నో చేయొచ్చు. కానీ.. అవేమీ చేయ‌కుండా ఉత్త‌గా కాళ్లు క‌డ‌గ‌టం ద్వారా వారి మ‌న‌సుల్ని దోచే ప్ర‌య‌త్నం చేశారు. తాజాగా అలాంటి ప‌నే మ‌రొక‌టి చేశారు.

పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు క‌డిగిన ఎపిసోడ్ లో ప‌లువురు విమ‌ర్శిస్తున్న వేళ‌.. వారి మీద త‌న‌కున్న ప్రేమ మామూలు కాద‌ని.. అమిత‌మైన‌ద‌న్న విష‌యాన్ని అర్థ‌మ‌య్యేలా చెప్పేందుకు త‌న సొంత డ‌బ్బులు.. త‌న పొదుపు మొత్తంలో నుంచి రూ.21 ల‌క్ష‌లను విరాళంగా అంద‌జేశారు. ఈ విష‌యాన్ని తాజాగా పీఎంవో ట్వీట్ చేసింది. పినాసి ప్ర‌ధాని త‌న సొంత డ‌బ్బుల్లోని రూ.21 ల‌క్ష‌లు దేశంలోని సఫాయి కార్మికుల‌కు విరాళంగా ఇచ్చే క‌న్నా.. జ‌నాలు క‌ట్టే ప‌న్ను డ‌బ్బుల్లో నుంచే మంచి ప‌థ‌కాన్ని వెల్ల‌డిస్తే బాగుండేది క‌దా?  ఎన్నిక‌ల వేళ ఏం చేయాలో.. ఎలా మైలేజీ పొందాలో మోడీకి తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీదని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News