మోడీ ఫోన్ చేసి మరీ ఆ పాపకు పేరు పెట్టారు

Update: 2016-10-22 08:19 GMT
భారతదేశ ప్రధానమంత్రి అంటే మాటలా? ఆయన లాంటి వ్యక్తి సమయం ఎంత విలువైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తికి.. ఎవరైనా ఏదైనా ఉత్తరం రాస్తే..? దానికి స్పందన ఉంటుందా? అందులోకి ఎవరైనా తమ వ్యక్తిగత అభిలాషను అందులో ప్రస్తావిస్తే.. అలాంటివి ప్రధాని దృష్టికి వెళుతుంటాయా? వాటికి ఆయన స్పందన ఉంటుందా? లాంటి సందేహాలు ఎన్నో వస్తుంటాయి. అయితే.. ప్రధాని స్థానంలో ఇంకెవరైనా ఉంటే చెప్పలేం కానీ.. నరేంద్ర మోడీ లాంటి నేత ఉన్నప్పుడు ఇలాంటి వాటి విషయంలో ఆయన స్పందన ఎలా ఉంటుందో చెప్పే ఘటన ఒకటి బయటకు వచ్చింది. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఆసక్తికర ఘటనలోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ లోని  ఈశాన్య ప్రాంతంలోని మీర్జాపూర్ జిల్లాకు చెందిన ఒక యువ జంటకు ఇటీవల అమ్మాయి పుట్టింది. ఆ చిన్నారి తల్లి  విభాసింగ్ ప్రధాని మోడీకి ఒక లేఖ రాశారు. ప్రధాని మోడీ స్టార్ట్ చేసిన బేటీ బచావో కార్యక్రమం తమ‌కెంతో స్ఫూర్తిని కలిగించిందని.. ఇద్దరు మహిళలు రియో ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన వేళ.. తమకు పుట్టిన ఆడపిల్లకు మోడీ పేరు పెట్టాలని కోరారు.

విభాసింగ్ రాసిన ఉత్తరాన్ని ఆమె భర్త భరత్ స్పీడ్ పోస్ట్ లో పీఎంవోకు పోస్ట్ చేశారు. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత వారికి ఒక ఫోన్ వచ్చింది. అందులో మాట్లాడిన వ్యక్తి తనను తాను పరిచయం చేసుకుంటూ.. తాను ప్రధాని నరేంద్ర మోడీనని.. తనకు వారు రాసిన లేఖ అందిందని చెప్పిన ఆయన కాసేపు వారితో మాట్లాడారు.ఆ యువ దంపతులు కోరినట్లుగా తల్లిదండ్రుల ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా ఆ చిన్నారికి.. ‘‘వైభవి’’ అన్న పేరు పెట్టారు. సాక్ష్యాత్తు ప్రధానే ఫోన్ చేసి.. తమ కుమార్తెకు పేరు పెట్టటంతో ఆ యువ దంపతుల ఆనందానికి అంతు లేని పరిస్థితి. ఈ విషయం బయటకు వచ్చిన నేపథ్యంలో కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులు పీఎంవోను ఆరా తీయగా.. ఇది వాస్తవమేనని వారు పేర్కొన్నారు. భారతదేశ ప్రధాని.. అందులోకి మోడీ లాంటి నేత సామాన్యులకు ఫోన్ చేసి వారి కోరికను మన్నిస్తూ పేరు పెట్టటం గొప్పే కదూ..? ఇలాంటి నాటకీయ పరిణామాలన్నీ మోడీకి మాత్రమే సాధ్యమవుతాయేమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News