సంరక్షకుడికి మరో ఛాన్స్ ఇస్తారా మోడీ

Update: 2016-07-26 04:46 GMT
ప్రధాని మోడీ మాటల్లోని మర్మం దేశ ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. తియ్యగా మాట్లాడుతూ.. తాను చేయాల్సింది చేసేసే ఆయన.. అందరి కంటే ఎక్కువగా తనకు నచ్చని వారినే ఎక్కువగా పొగుడుతారా? అన్న సందేహం కలిగేలా ఆయన వ్యాఖ్యలు కనిపిస్తాయి. మొన్నటికి మొన్న ఆర్ బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ను ఉద్దేశించి విపరీతంగా పొగిడేసిన ఆయన.. యూపీఏ హయాంలో నియమించిన ఆయన్ను ఇంటికి పంపేశారు.ఆయన శక్తి సామర్థ్యాల్ని విపరీతంగా పొగిడేసిన మోడీ.. ఆయనకు మరో టర్మ్ అవకాశం ఇచ్చే ‘పవర్’ తనకున్నా.. ఆ పని మాత్రం చేయలేదు.

తాజాగా రాష్ట్రపతి ప్రణబ్ దాను ఉద్దేశించి మోడీ విపరీతంగా పొగిడేశారు. నిజానికి వీరిద్దరిది భిన్న ధ్రువాలు. ప్రణబ్ దా కరుడు కట్టిన కాంగ్రెస్ వాది అన్న విషయం దేశంలోని ప్రతి ఒక్కరికి తెలిసిందే. అదే సమయంలో మోడీలో బీజేపీ భావజాలం ఎంతన్నది ఎవరికి వివరించి చెప్పాల్సిన అవసరం ఉండదు. రెండు భిన్న ధ్రువాలు ఎప్పటికి కలుసుకోలేవు.కానీ.. తమకున్న పరిమితులతో హుందాగా వ్యవహరించటం మామూలే. అయితే.. అందుకు భిన్నంగా ప్రణబ్ దాను తన గురువుగా.. మార్గదర్శకుడిగా పొగిడేయటం మోడీ మార్క్ గా చెప్పాలి.

మరింతగా పొగిడేస్తున్న ప్రణబ్ దాను.. మరోసారి రాష్ట్రపతి పీఠం మీద మోడీ కూర్చోబెడతారా? అన్న ప్రశ్న వేసుకుంటే.. మోడీ పొగడ్తల్లో మర్మం ఇట్టే అర్థమవుతుంది. అందరి మనసుల్ని దోచుకోవటానికి వీలుగా టైలర్ మేడ్ వ్యాఖ్యలు చేసే ఆయన.. మాటలు ఇంత తియ్యగా చెబుతూ.. చేతల్లో చేయాల్సింది చేసేస్తుంటారు. తాజాగా ప్రణబ్ దా విషయంలోనూ అంతే. వచ్చే ఏడాది పదవీ కాలం పూర్తి కానున్న ప్రణబ్ దాను పొగిడేయటం ద్వారా.. మోడీ చెప్పకనే చెప్పింది ఒక్కటే.. తనను అందరికి ఆమోదయోగ్యుడైన వ్యక్తినని చాటుకోవటం.  ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మోడీ ఎవరినైతే గురువుగా అభివర్ణిస్తారో వారిని పూర్తిగా పక్కన పెట్టేయం కనిపిస్తుంది.మోడీని ఎంతగానో ప్రమోట్ చేసిన ఆయన రియల్ గురువు అద్వానీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ దాను కూడా మోడీ గురువుగా.. సంరక్షకుడిగా అభివర్ణించటం చూస్తే మోడీ తెలివిని చూసి మురిసిపోకుండా ఉండలేం. ప్రణబ్ దా గురువు అయితే.. అద్వానీ మాటేంది మోడీ జీ..?
Tags:    

Similar News