మోదీ క‌ల సాకార‌మైంద‌హో!

Update: 2017-08-11 11:31 GMT
జ‌న సంఘ్ గా ప్ర‌స్థానం ప్రారంభించిన ఓ చిన్న పార్టీ... ఆ త‌ర్వాత‌ భార‌తీయ జ‌న‌తా పార్టీగా పేరు మార్చుకుని దేశ రాజ‌కీయాల‌ను ఓ కీల‌క మ‌లుపు తిప్పేసింద‌నే చెప్పాలి. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత‌... గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ఏక‌చ్ఛ‌త్రాధిప‌త్యానికి తెర దించేసిన క‌మ‌ల నాథులు కేంద్రంలో స్వ‌త‌హాగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగారు. గ‌తంలో కాంగ్రెస్ వ్య‌తిరేక కూట‌మి కూడా అధికార ప‌గ్గాలు చేప‌ట్టినా... మొన్నటి ఎన్నిక‌ల్లో ఏ ఒక్క పార్టీ అండ లేకుండానే సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌గ‌ల స్థాయిలో సీట్లు సాధించిన బీజేపీ... నిజంగానే దేశ రాజ‌కీయాల‌ను ఓ మ‌లుపు తిప్పేసిందనే చెప్పాలి. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో త‌న‌దైన రీతిలో సోష‌ల్ మీడియాను బాగా వినియోగించుకున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ... కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ కొట్టారు.

దేశాన్ని అత్య‌ధిక కాలం పాలించిన పార్టీగా కాంగ్రెస్‌ కు ఘ‌న చ‌రిత్ర ఉన్నా... ప్ర‌స్తుత లోక్ స‌భ‌లో ఆ పార్టీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్కించుకునేందుకు అవ‌స‌ర‌మైనన్ని సీట్లు కూడా ద‌క్క‌లేదు. ఇదే వాద‌న‌ను కాస్తంత గ‌ట్టిగానే వినిపించిన మోదీ... కాంగ్రెస్ పార్టీని అవ‌హేళ‌న కూడా చేశారు. ఇంత విజ‌యం సాధించినా కూడా మోదీ మ‌న‌సులో ఎక్క‌డో వెలితి క‌నిపించేది. లోక్ స‌భ‌లో ఎంత మేర బ‌ల‌మున్నా... కీల‌క బిల్లుల విష‌యంలో రాజ్య‌స‌భ మ‌ద్ద‌తు పొందాలంటే మోదీ సర్కారుకు అతి క‌ష్టంగానే ప‌రిణ‌మించింది. ఈ క్ర‌మంలోనే జీఎస్టీ బిల్లుకు ఆమోద ముద్ర వేయించుకునేందుకు బీజేపీ స‌ర్కారు నానా పాట్లు ప‌డాల్సి వ‌చ్చింది. కాంగ్రెస్ అధ్వాన్న ప‌రిస్థితిని చూసి కామెంట్లు చేసిన మోదీ కేబినెట్ మంత్రులే స్వ‌యంగా యూపీఏ చైర్మ‌న్ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇంటి ముందు క్యూ క‌ట్టాల్సి వ‌చ్చింది. దీనికంత‌టికీ ఒకే ఒక్క అంశ‌మే కార‌ణంగా నిలిచింది.

అదేంటంటే... లోక్ స‌భ‌లో బీజేపీకి బ‌ల‌మున్నా... రాజ్య‌స‌భ‌లో ఆ పార్టీకి అంత‌గా బ‌లం లేదు. అందులోనూ రాష్ట్ర‌ప‌తి స‌హా ఉప‌రాష్ట్ర‌ప‌తి హోదాలో ఉన్న రాజ్యస‌భ చైర్మ‌న్ ప‌ద‌వి కూడా  కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే ఉంది. ఈ క్ర‌మంలో కీల‌క బిల్లుల విష‌యంలో క‌మ‌ల‌నాథులు కాంగ్రెస్ కాళ్లు ప‌ట్టుకోక త‌ప్ప‌లేదు. ఇదే అంత‌టి ఘ‌న విజ‌యం సాధించినా... మోదీలో ఓ చిన్న అసంతృప్తికి కార‌ణ‌మైంది. అయితే ఇప్పుడా ప‌రిస్థితి లేద‌నే చెప్పాలి. ఎందుకంటే... ఇప్పుడు ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వితో పాటు రాష్ట్రప‌తి - ఉపరాష్ట్రప‌తి (రాజ్య‌స‌భ చైర్మ‌న్‌) - లోక్ స‌భ స్పీక‌ర్‌... ఈ నాలుగు ప‌ద‌వులు కూడా బీజేపీ నేత‌ల‌కే ద‌క్కేశాయి. రాష్ట్రప‌తిగా ఇటీవ‌లే బీజేపీ నేత రామ్‌ నాథ్ కోవింద్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గా, అంత‌కుముందే ప్ర‌ధానిగా మోదీ - లోక్ స‌భ స్పీక‌ర్‌ గా సుమిత్రా మ‌హాజ‌న్ లు బాధ్య‌త‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా తెలుగు నేల‌కు చెందిన కీల‌క రాజ‌కీయ‌వేత్త ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు నేటి ఉద‌యం ఉప‌రాష్ట్రప‌తిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. దీంతో దేశంలోని నాలుగు కీల‌క పోస్టుల్లోనూ బీజేపీ నేత‌లే కూర్చున్న‌ట్లైంది. ఇలా ఈ నాలుగు ప‌ద‌వుల‌ను బీజేపీ ఇప్ప‌టిదాకా ఎప్పుడు కూడా చేజిక్కించుకోలేదు. గ‌తంలో అట‌ల్ బిహారీ వాజ్‌ పేయి ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు కూడా ఈ నాలుగు కీల‌క పోస్టుల‌ను బీజేపీ చేజిక్కించుకోలేక‌పోయింది. అయితే ఆ రికార్డుల‌న్నింటినీ బ‌ద్ద‌లు కొడుతూ మోదీ నేతృత్వంలో ముందుకు సాగుతున్న బీజేపీ ఇప్పుడు దేశంలోని నాలుగు అత్యున్న‌త స్థానాల‌ను ద‌క్కించుకుని స‌రికొత్త చ‌రిత్ర‌ను లిఖించినట్లైంది.
Tags:    

Similar News