అంబేద్కర్ చేతే కాలేదు, నా చేతవుతుందా?

Update: 2016-03-22 06:08 GMT
దళితుల ఓటుబ్యాంకుపై ప్రధానమంత్రి మోడీ గురి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ కు పెట్టని కోటలా ఉంటారని చెప్పే దళితుల్ని తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాన్ని గత కొంతకాలంగా చేస్తున్న మోడీ.. తాజాగా స్పీడ్ పెంచినట్లుగా కనిపిస్తోంది. దళితుల మనసు దోచుకునే చిన్న అవకాశం దొరికినా వదిలిపెట్టని మోడీ.. తాజాగా తనకు లభించిన ఒక అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్నారని చెప్పక తప్పదు.

తాజాగా అంబేడ్కర్ జాతీయ స్మారక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన ఆయన.. దళితుల మనసుల్ని దోచుకునేలా ప్రసంగించారు. తాము అధికారంలో ఉన్నంతవరకూ దళితులు.. బడుగువర్గాలకు ఇచ్చే రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి ముప్పు ఉండదని తేల్చిన ఆయన.. కొందరు రాజకీయ నాయకులు ప్రజల్ని తప్పుదారి పట్టేలా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ తమను విమర్శించే వారిపై గురి పెట్టారు.

మధ్యప్రదేశ్.. గుజరాత్.. మహారాష్ట్ర.. పంజాబ్.. హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నో ఏళ్లుగా పరిపాలించినా.. ఎప్పుడు తాము దళితుల కోటాకు కోత వేయలేదని.. అలాంటి సాహసం తాము ఎప్పటికీ చేయమని చెప్పుకోవటం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన మరికాస్త ముందుకు వెళ్లి.. చివరకు అంబేడ్కరే మళ్లీ వచ్చినా దళితుల హక్కుల్ని లాగేసుకోలేరని చెప్పేశారు.

కాంగ్రెస్ పార్టీని.. వారి విధానాల్ని అంబేడ్కర్ విభేదించేవారన్న విషయాన్ని చెబుతూ.. ఆస్తి.. పలు అంశాల్లో మహిళలకు సమానహక్కులు కల్పించేందుకు ఉద్దేశించిన హిందూ కోడ్ బిల్లుకు మద్దుతు లేకపోవటంతో నెహ్రూ కేబినెట్ లో న్యాయమంత్రిగా ఉన్న అంబేడ్కర్ తన పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేసిన మోడీ.. ఈ విషయాన్ని ప్రజలకు తెలియకుండా వక్రీకరించారంటూ మండిపడ్డారు.

కాంగ్రెస్ హయాంలో అంబేడ్కర్ కు ఎంతో అన్యాయం జరిగిందని వాపోయిన మోడీ.. తాము ఆ తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. అంబేడ్కర్ కు ఎంత అన్యాయం చేసింది.. అదెవరు చేసింది అందరికి తెలుసంటూ పరోక్షంగా కాంగ్రెస్ ను ఏసుకున్న మోడీ.. ముంబయిలోని ఇందు మిల్లుపై నిర్ణయాన్ని గత ప్రభుత్వాలు ఎందుకు పెండింగ్ లో పెట్టాయి? అంటూ ప్రశ్నించారు. లండన్ లో అంబేడ్కర్ నివసించిన ప్రాంతం విషయంలోనూ ఇదే జరిగిందని.. ఇన్నేళ్లు వాళ్లు (కాంగ్రెస్) ఏమీ చేయలేదు సరికాదా.. ఇప్పుడు మమ్మల్ని నిందిస్తున్నారంటూ దుయ్యబట్టారు.

గతంలో జరిగిన తప్పుల్ని సరిదిద్దేందుకు అలీపూర్ రోడ్డులో అంబేడ్కర్ నివసించిన ఇంటిని స్మారకంగా నిర్మించే కార్యాన్ని 2018 మార్చి నాటికి పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. ఆ ఏడాది ఏప్రిల్ 14న ఈ స్మారకాన్ని తానే ప్రారంభిస్తానని.. ముందుగానే తన డేట్ ఇచ్చేయటమే కాదు.. దాన్ని సమయానికి పూర్తి చేయాల్సిన అవసరాన్ని మోడీ ముందుగానే చెప్పేయటం గమనార్హం. మరి.. దళితులపైన మోడీ కురిపిస్తున్న ప్రేమకు వారెలా స్పందిస్తారో..?
Tags:    

Similar News