మోడీ మాటల మాయాజాలాన్ని వింటారా?

Update: 2016-03-27 05:12 GMT
మాటల మారాజు ప్రధాని మోడీ అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా రాష్ట్రానికి అదే పనిగా మోడీ పర్యటిస్తున్నారంటే మరో ఆలోచన లేకుండా చెప్పేయొచ్చు.. ఆయన ఆ రాష్ట్రం మీద ప్రత్యేక గురి పెట్టారని. ఏదైనా రాష్ట్రంలో పాగా వేయాలని డిసైడ్ అయితే చాలు.. తన తీరిక లేని బిజీ షెడ్యూల్స్ ఉన్నా.. ఏదోలా వీలు చేసుకొని మరీ ప్రతి నెలా ఠంచనుగా సదరు రాష్ట్రానికి వెళ్లటం.. అక్కడి వారి మనసు దోచుకునే పని షురూ చేయటం ఆయనకు అలవాటే. ఆ మధ్యన కాశ్శీర్ ను టార్గెట్ చేసి.. అదే పనిగా ఆ రాష్ట్రానికి వెళ్లినా.. ఆయన కోరుకున్నట్లు సదరు మంచురాష్ట్రంలో పూర్తిగా పాగా వేయలేకపోయారు. చివరకు.. మిత్రుడి అండతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. మరోసారి మిత్రుడితో ప్రభుత్వాన్ని కొలువు తీర్చే పనిలో ఈ మధ్యన బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా మోడీ గురి.. అసోం మీద పడింది. మరికొద్దిరోజుల్లో నాలుగు రాష్ట్రాలు.. ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉన్నది ఒక్క అసోంలోనే. అందుకే.. ఆ రాష్ట్రం మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసిన మోడీ.. తన మాటల మాయాజాలాన్ని అసోం ప్రజల మీద ప్రయోగిస్తున్నారు. తాజాగా అసోంలోని పలుప్రాంతాల్లో ఎన్నికల ప్రచార సభల్ని నిర్వహించిన మోడీ.. ఈ సందర్భంగా తన అమ్ములపొదిలోని ‘‘టీ అమ్ముకున్న’’ అస్త్రాన్ని బయటకు తీయటమే కాదు.. తాను అమ్మింది అస్సాం టీనేనని చెప్పుకొచ్చారు. ఏమీ తెలియని వయసులో బతుకునిచ్చిన అసోం టీని గుర్తుకు తెచ్చుకోవటం ద్వారా.. ప్రధానిగా తనకు మరింత బలం చేకూరేలా అసోం ప్రజలు అండగా నిలవాలన్న మాటను ఆయన చెప్పకనే చెప్పేస్తున్నారు.

అసోం పర్యటన సందర్భంగా మోడీ చెప్పిన మాటలు వింటే.. పవర్ కోసం ఆయన ఎంత తియ్యగా మాట్లాడతారో ఇట్టే అర్థమవుతుంది. గుజరాతీయుల్లో ఉత్సాహం నింపేందుకు అసోం టీ అమ్మవాడినని.. తనకు అసోంతో బలమైన బంధముందని చెప్పుకొచ్చారు. అసోం రాష్ట్ర్రంలో తిరుగులేని కాంగ్రెస్ నేత కమ్ ముఖ్యమంత్రి అయిన తరుణ్ గొగోయ్ కు వ్యతిరేకంగా మాట్లాడితే మొదటికే మోసం వస్తుందన్న విషయం మీద అవగాహన ఉన్నమోడీ తెలివిగా ఎలా మాట్లాడారో ఆయన మాటల్లోనే వినాలి.

‘‘ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కు వ్యతిరేకంగా పోరాడటం లేదు. ఈ ఎన్నికలు ప్రధాని.. ముఖ్యమంత్రి మధ్య యుద్ధమని ఆయన చెబుతున్నారు. కానీ.. ఆయన నాకంటే ఎంతో సీనియర్. ఆయన ఆశీర్వాదాలు నాకు కావాలి. ఒక వ్యక్తితో పోరాడటం వల్ల నా సమయం వృధా చేసుకోదలచుకోలేదు. నా పోరాటం.. పేదరికం.. నిరుద్యోగం.. అవినీతి.. విద్య లేకపోవటం.. అనారోగ్యం.. వెనుకుబాటుతనం మీదనే. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదేళ్లపాటు ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించినా ఈ రాష్ట్రానికి పెద్దగా ఒరిగిందేమీ లేదు. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో అసోం ఒకటిగా ఉండేది. ఆ తర్వాత కాంగ్రెస్ 60ఏళ్ల పాలనలో తీవ్ర వెనుకబాటుకు గురైంది. అందుకే ఒక్క అవకాశం ఇవ్వమని కోరుతున్నా’’ అంటూ అసోమీల మనసు దోచుకునేలా మాటలు చెబుతున్నారు. మరి.. మోడీ మాటలకు వారు మెల్ట్ అవుతారో? లేదో? చూడాలి.
Tags:    

Similar News