రాష్ట్రప‌తి పదవిపై ఆ బడా బిజినెస్ మ్యాన్ కన్ను

Update: 2016-06-02 10:09 GMT
ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎన్‌.ఆర్‌.నారాయణమూర్తి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుత రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్‌ ముఖ‌ర్జీ ప‌ద‌వి ముగియ‌నున్న నేప‌థ్యంలో త‌న పేరు తెర‌మీద‌కు రావ‌డంపై ఆచితూచి స్పందించారు. రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలని పలువురు సన్నిహితులు - నాయకులు తనను కోరారనీ - దానిపై ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదనీ మూర్తి తెలిపారు. ఈ పదవికి పోటీ పడుతున్న విషయమై వ్యాఖ్యానించేందుకు ఇది సరైన సమయం కాదని అన్నారు.

తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ దేశ ప్ర‌థ‌మ పౌరుడి ప‌ద‌వి ఎంపిక‌ అంశానికి సంబంధించి ఇప్పుడే స్పందించటం సరికాదన్నారు. ఎవరిని రాష్ట్రపతిని చేయాలో, ఎవరిని చేయకూడదో అధికారంలో ఉన్నవారికి తెలుసునని ప‌రోక్షంగా బంతిని కేంద్ర ప్ర‌భుత్వం కోర్టులోకి పంపించారు. ఇలాంటి అంశాలపై నిర్ణయాలను వారికే వదిలేయాలనీ, దీనిపై చర్చించడం సబబుగా ఉండదని మూర్తి సున్నితంగా స‌మాధానం దాట‌వేశారు. ఇదిలా ఉండ‌గా 2007లోనూ రాష్ట్రపతి పదవికి మూర్తి పేరు ప్రచారంలోకి వచ్చింది. అప్ప‌టి కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ఈ ప్ర‌తిపాద‌న వెన‌క్కుపోయింది. తాజాగా మ‌రోమారు మూర్తి పేరును ప‌లు మీడియా సంస్థ‌లు ప్ర‌స్తావిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో నారాయ‌ణ మూర్తి ఈ విధంగా స్పందించారు.
Tags:    

Similar News