సీట్ల పెంపుపై లోకేశ్ కు ఇంకా ఆశ చావ‌లేదే!

Update: 2017-08-03 11:28 GMT
తెలుగు రాష్ట్రాల్లో 2019 ఎన్నిక‌ల నాటికి అసెంబ్లీ సీట్ల పెంపుద‌ల లేనే లేద‌ని న‌రేంద్ర మోదీ నేతృత్వంలోనే కేంద్ర ప్ర‌భుత్వం పార్ల‌మెంటు సాక్షిగా తేల్చి చెప్పేసింది. అంతేనా... రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్ర‌బాబునాయుడు, క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేరుగా ఈ విష‌యాన్ని వారి ముఖం మీదే చెప్పేశార‌న్న వాదన కూడా లేక‌పోలేదు. ఈ త‌ర‌హాలో వ‌రుస‌గా వ‌చ్చిన ప్ర‌క‌ట‌న‌ల‌తో చంద్ర‌బాబు స‌హా కేసీఆర్ కూడా సీట్ల పెంపుపై ఆశ‌లు వ‌దిలేసుకున్నారు. ఇక ఇత‌ర పార్టీల నుంచి బ‌ల‌వంతంగా తెచ్చుకున్న నేత‌ల‌కు సీట్ల‌ను స‌ర్దుబాటు చేసే ప‌నిలో ఇద్ద‌రు సీఎంలు ప‌డిపోయార‌న్న వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, చంద్ర‌బాబు కేబినెట్ లో కీల‌క శాఖ‌ల మంత్రిగా ఉన్న ఆయ‌న కుమారుడు నారా లోకేశ్ కు మాత్రం సీట్ల పెంపుద‌లపై ఇంకా ఆశ‌లు చావ‌న‌ట్లుగా నిన్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఓ ఛానెల్ కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ, ఆ త‌ర్వాత మ‌రికొంద‌రు మీడియా ప్ర‌తినిధుల‌తో పిచ్చాపాటిగా మాట్లాడిన సంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయినా సీట్ల పెంపుపై లోకేశ్ ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... *2019లోగా అసెంబ్లీ సీట్లు పెర‌గ‌వ‌ని ఎవ‌రు చెప్పారు? ఈ మాట‌ను కేంద్రం చెప్ప‌లేదే? అయినా సీట్ల పెంపు త‌ప్ప‌నిస‌రిగా జ‌రిగి తీరుతుంది. సీట్ల పెంపుపై మొన్న కేంద్రం చేసిన ప్ర‌క‌ట‌న సారాంశం ఏమిటంటే... తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపును రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారానే చేయాల్సి ఉంది అని మాత్ర‌మే కేంద్రం చెప్పింది. అంటే... 2019లోగా అసెంబ్లీ సీట్లు పెర‌గ‌డం ఖాయ‌మే* అని లోకేశ్ వ్యాఖ్యానించారు.

అయినా మొన్న పార్ల‌మెంటులో టీడీపీ ఎంపీ ముర‌ళిమోహ‌న్‌ తో పాటు టీఆర్ ఎస్ ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి సీట్ల పెంపున‌కు సంబంధించి సంధించిన ఓ ప్ర‌శ్న‌కు కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి హ‌న్స్ రామ్ లిఖిత పూర్వ‌క స‌మాధానం ఇచ్చారు. 2019లోగా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుద‌ల సాధ్యం కాదు. 2026లో అన్ని రాష్ట్రాల్లో సీట్ల పెంపుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెరుగుతాయ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. కేంద్రం ఇంత స్పష్టంగా ప్ర‌క‌న‌ట చేస్తే... లోకేశ్ మాత్రం దానిని త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకుని... తమ పార్టీలోకి చేరిన ఇత‌ర పార్టీ నేత‌లు ఏమాత్రం ఇబ్బంది ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, సీట్లు త‌ప్ప‌నిస‌రిగా పెరుగుతాయ‌ని చెప్పిన‌ట్లుగా ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.
Tags:    

Similar News