చినబాబు మంత్రి కావాలని అనుకోవటం లేదట

Update: 2016-04-28 10:26 GMT
ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేశ్ తాజాగా ఒక విషయం మీద స్పష్టత ఇచ్చేశారు. తనకు సంబంధించిన ఈ మధ్య కాలంలో మీడియాలో వస్తున్న ఒక అంశంపై ఆయన సూటిగా స్పందించారు. తనను మంత్రివర్గంలో భాగస్వామ్యం చేయాలన్న అంశం మీద తనకు ఆ ఆలోచన లేదని స్పష్టం చేయటంతో పాటు.. తాను మంత్రి పదవి చేపట్టేందుకు సిద్దంగా లేనన్న విషయాన్ని తేల్చేశారు.

2019 ప్రత్యక్ష ఎన్నికల బరిలో తాను రెఢీ అవుతున్నట్లు వెల్లడించిన లోకేశ్.. ఆ తర్వాతే క్యాబినెట్ లో చేరాలని భావిస్తున్నట్లు చెప్పారు. విజయవాడలో మీడియాతో ఇష్టాగోష్టి కార్యాక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రోజా వ్యాఖ్యలతో పాటు.. జగన్ మీద కూడా పలు విమర్శల్ని లోకేశ్ సంధించారు. టీడీపీ నేతలతో తాము చర్చకు సిద్ధంగా లేమంటూ రోజా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన లోకేశ్.. జగన్ పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని.. చర్చకు తానూ సిద్ధమేనని ప్రకటించారు.

తమపై అవినీతి ఆరోపణలు చేస్తున్న జగన్ తీరుపై మండిపడ్డ లోకేశ్.. దేశంలో ఎవరి మీద అవినీతి ఆరోపణలు వచ్చినా.. అందులో తమ భాగస్వామ్యం ఉందంటూ జగన్ పార్టీ ఆరోపించటం కామన్ గా మారిందని చెప్పుకొచ్చారు. తమ మీద జగన్ చేసే ఆరోపణలు ఎంత ఫన్నీగా ఉంటాయో చెప్పే ప్రయత్నం చేసిన లోకేశ్.. రూ.350 కోట్లు ఉన్న ఫైబర్ గ్రిడ్ లో రూ.1400 కోట్ల అవినీతి జరిగిందని చెబుతున్నారని.. అదెలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

ప్రతి ఏటా తమ కుటుంబ సభ్యులమంతా ఆమ ఆస్తుల వివరాల్ని వెల్లడిస్తున్నామని.. మరి.. తమ మాదిరి జగన్ ఎప్పుడైనా ఆస్తుల వివరాల్ని వెల్లడించారా? అని ప్రశ్నించారు.  తనకున్న ఆస్తుల వివరాలు ప్రకటించేందుకు జగన్ ఇప్పటికైనా రెఢీ అవుతారా? అంటూ పెద్ద ప్రశ్నే వేశారు. మరి.. లోకేశ్ వేసిన ప్రశ్నలకు జగన్ రియాక్ట్ అవుతారా?
Tags:    

Similar News