చినబాబును కులం అడిగితే.. అలా చెబుతాడట

Update: 2020-02-05 04:52 GMT
ఆసక్తికర వ్యాఖ్య చేశారు టీడీపీ ఎమ్మెల్సీ కమ్.. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకొని కులం ఏమిటని అడుగుతున్నారని తప్పు పట్టారు. అరెస్టు అయిన ఉద్యమకారుల కులం గురించి అడుగుతున్నారని.. అలా అడిగే వారికి తమది ఆంధ్రప్రదేశ్ కులమని చెప్పాలన్నారు.

వరదలు వస్తే అమరావతి మునుగుతుందని సీఎం జగన్ తప్పుడు ప్రచారం చేశారన్నారు. తరచూ ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసినట్లు ఆరోపిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. తాజాగా తెనాలిలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన లోకేశ్.. రాజధాని రైతులు 49 రోజులుగా ఉద్యమం చేస్తున్నారన్నారు.

రైతులు ఉద్యమం చేస్తుంటే.. పోలీసులు వారి పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారన్నారు. అమరావతి కోసం పోరాడుతున్న మహిళల విషయంలో పోలీసుల తీరును తప్పు పట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కారు అద్దం పగిలితే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ నేతలు స్పందించారని.. మరి.. అమరావతి ప్రాంతంలో పాతిక మంది రైతులు చనిపోతే ఎందుకు స్పందించరంటూ ప్రశ్నించారు. కుల భావన పెరిగిపోవటానికి బాబు పాలనే కారణమన్న విమర్శలు ఓవైపు వినిపిస్తున్న వేళ.. కులం అడిగితే ఆంధ్రప్రదేశ్ అన్న మాటను చెప్పాలన్న లోకేశ్.. తమ హయాంలో ఆ తీరును ప్రదర్శించి ఉంటే ఇప్పుడిన్ని తిప్పలు ఉండేవి కావేమో?
Tags:    

Similar News