లోక్ సభలో ఎన్టీవోడికి భారతరత్న మాట

Update: 2016-05-04 04:20 GMT
తెలుగువాడి కీర్తి పతాకాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన తెలుగోడు.. ఒకేఒక్కడు ఎన్టీవోడు. ప్రాంతాల మాట ఎలా ఉన్నా.. విభేదాల పంచాయితీలు ఎన్ని ఉన్నా.. ఎన్టీవోడు విషయంలో మాత్రం  మినహాయింపు ఉంటుంది. ఆంధ్రా అన్న మాట అంటేనే అంతెత్తు ఎగిరిపడతారన్న పేరున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఎన్టీవోడి విషయం వస్తే చాటు.. పొగడ్తలతో ముంచెత్తుతారు.

దేశంలో ఎంతోమందికి భారతరత్నలు ఇచ్చినా.. ఎన్టీవోడికి మాత్రం ఆ అవకాశం దక్కలేదు. నిజానికి ఎన్టీవోడు చేసిన పనులకు.. ఆయన సిద్ధాంతాలకు ఎన్నో అవార్డులు వరించాల్సి ఉంది. కానీ.. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించటం ఆయనకు శాపంగా మారిందని చెప్పక తప్పదు. గతంలో జరిగిన తప్పును వర్తమానంలో సరి చేయటం ద్వారా.. ఆ మహనీయుడికి మర్యాద ఇచ్చినట్లే అవుతుంది. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ తెలుగు లోగిళ్లలో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. రాజకీయ పంచాయితీలతో ఆ మాట బలంగా వినిపించకుండా రాజకీయ పక్షాలు అడ్డుకున్నాయని చెప్పాలి.

ఇందుకు భిన్నంగా తాజాగా పార్లమెంటులో ఎన్టీవోడికి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ను ఏపీ టీడీపీ ఎంపీ మురళీమోహన్ తెర మీదకు తీసుకొచ్చారు. ఎన్టీఆర్ గొప్పతనాన్ని లోక్ సభలో చెప్పిన ఆయన.. వినూత్న రీతిలో ప్రజలకు సేవలు అందించే సంక్షేమ పథకాల్ని అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దేశానికి గర్వకారణమైన ఎన్టీవోడికి భారతరత్న పురస్కారం ఇవ్వాలని తన వాణిని బలంగా వినిపించారు. ఎన్టీవోడికి భారతరత్న పురస్కారం అంటే.. తెలుగు వాళ్లందరికి ఘన సన్మానంగా.. తెలుగుకు జరిగే పురస్కారంగా భావించాల్సిందే.
Tags:    

Similar News