ముంబయిలో 3 ఇడ్లీలు 60పైసలే..?

Update: 2015-11-26 04:00 GMT
రూపాయికి సరైన చాక్లెట్ దొరకని రోజులివి. ఇక.. పది పైసలు.. ఇరవై పైసలు.. యాభై పైసలు లాంటి నాణెల వినియోగం ఆపేసి చాలానే ఏళ్లు అయిన పరిస్థితి. ఇలాంటిది 5 పైసలకు కాఫీ.. 20 పైసలకు ఉప్మా.. 60 పైసలకు 3 ఇడ్లీలు ఇచ్చే అవకాశం ఎంతమాత్రం ఉండదు. కానీ.. అలాంటిదే తాజాగా ముంబయిలో చోటు చేసుకుంది. ముంబయి లాంటి మహానగరంలో ఇలా పైసళ్లకు టిఫిన్లు పెట్టటం ఏమిటి? ఇది నిజమేనా? అన్న సందేహం అక్కర్లేదు. పైసలతో బిల్లులేసి తమ హోటల్ కు వచ్చిన కస్టమర్లకు స్వీట్ షాకిచ్చారు.

ముంబయి లాంటి మహానగరంలో వంద నోటు పెట్టందే ఒక టిఫిన్ సెంటర్ లో టిఫిన్ రావటం ఎలా సాధ్యం అని అనుకోవచ్చు కానీ.. కేఫ్ మద్రాస్ తీసుకున్న నిర్ణయంతో ఇలాంటిది సాధ్యమైంది. నిజానికి పైసలతో టిఫిన్లు వడ్డించిన కేఫ్ మద్రాస్.. అలా చేయటానికి పెద్ద కారణమే ఉంది. ఈ మంగళవారం నాటికి ఈ హోటల్ పెట్టి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. తాము హోటల్ ప్రారంభించిన రోజున ఏ ధరలకైతే టిఫిన్లు సప్లై చేశారో.. అదే ధరకు ఈ మంగళవారం ఒక్కరోజు అమ్మి.. వినియోగదారుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు.

1940లో తాము హోటల్ ప్రారంభించామని.. తమను ఆదరించిన కస్టమర్లకు గుర్తుండిపోయే కానుక ఇవ్వాలన్న ఉద్దేశంతో 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నాటి ధరలకే నేడు టిఫిన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా కేఫ్ మద్రాస్ పేర్కొంది. నాటి ధరలతో నేటి టిఫిన్లు అమ్మేసి కస్టమర్ల మనసుల్ని కేఫ్ మద్రాస్ దోచేసుకుంది.
Tags:    

Similar News