ధోని రిటైర్మెంట్‌ పై అతడి తల్లిదండ్రుల మాట

Update: 2019-07-17 11:05 GMT
సుదీర్ఘ కాలంగా టీం ఇండియా కోసం ఆడుతున్న మహేంద్ర సింగ్‌ ధోనీ ఇక క్రికెట్‌ కు గుడ్‌ బై చెప్పే సమయం వచ్చిందని చాలా మంది భావిస్తున్నారు. ఇండియాకు అద్బుత విజయాలను అందించిన ధోనీ మొన్నటి ప్రపంచ కప్‌ లో కాస్త స్లో ఆట తీరును కనబర్చాడు. కీలక సమయాల్లో మంచి ఆటను కనబర్చినా కూడా గతంలో మాదిరిగా ధోనీలో ఆ చురుకుదనం లేదు అంటూ సీనియర్లు కూడా కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రపంచ కప్‌ ముగిసిన వెంటనే ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే ప్రపంచ కప్‌ గెలిస్తే ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించే వాడు. కాని ఓటమితో రిటైర్మెంట్‌ తీసుకోవడం అతడికి ఇష్టం లేదేమో అందుకే రిటైర్మెంట్‌ విషయంలో ఇంకా ఏం తేల్చలేదు.

వచ్చే నెలలో టీం ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటించబోతుంది. ఆ పర్యటనకు ధోనీని దూరంగా ఉంచాలని బీసీసీ వర్గాలు నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ధోనీ స్థానంలో రిషబ్‌ పంత్‌ ను కీపర్‌ గా ఎంపిక చేసే యోచనలో బీసీసీ సెలక్షన్‌ కమిటీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ధోనీ ఫైనల్‌ 11 లో లేకపోయినా కూడా అక్కడకు వెళ్లే 15 మంది బృందంలో ఉంటాడని బీసీసీ వర్గాలే చెబుతున్నాయి. టీంకు సపోర్ట్‌ కోసం.. సలహాలు సూచనల కోసం ధోనీ విండీస్‌ కు వెళ్తాడని అంటున్నారు. ధోనీ రిటైర్మెంట్‌ విషయమై బీసీసీ వర్గాలు పూర్తిగా ఆయన నిర్ణయానికే వదిలేశాయి.

ఇక ధోనీ రిటైర్మెంట్‌ ను ప్రకటించాలని అతడి తల్లిదండ్రులు కోరుకుంటున్నారట. ధోనీకి చిన్ననాటి కోచ్‌ అయిన కేశవ్‌ బెనర్జీ తాజాగా ధోనీ ఇంటికి వెళ్లిన సమయంలో ధోనీ క్రికెట్‌ విడిచి పెడితే బాగుంటుందని.. ఇప్పటి వరకు ధోని చాలా క్రికెట్‌ ఆడాడు. రిటైర్‌ అయిన తర్వాత మాతో కలిసి ఇంట్లో ఉంటాడని ఆశిస్తున్నట్లుగా తల్లిదండ్రులు అన్నట్లుగా కేశవ్‌ బెనర్జీ చెప్పుకొచ్చారు. అయితే కేశవ్‌ బెనర్జీ మాత్రం ధోనీ ఇంకొంత కాలం క్రికెట్‌ ఆడాలని.. టీ20 వరల్డ్‌ కప్‌ పూర్తి అయిన తర్వాత రిటైర్మెంట్‌ ఇవ్వాలని భావిస్తున్నాడు. మరి ధోనీ మనసులో ఏం ఉందో ఆయన నోరు విప్పితే కాని తెలియదు.

Tags:    

Similar News