మోడీ ఊ అంటే అరగంటలో పనైపోతుందట

Update: 2015-11-24 05:46 GMT
విభజన చట్టంలో సవరణ కోసం పట్టుపట్టి ఉభయ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన కోసం తీవ్రంగా ప్రయత్నించాలని టీఆరెస్ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. గతంలో ఈ అంశాన్ని టిఆర్‌ ఎస్ పెద్దగా పట్టించుకోకపోయినా ఇప్పుడు ప్రధానంగా దీనిపై దృష్టి సారించాలని నిర్ణయించారు. విభజన చట్టంలోనే ఆంధ్రప్రదేశ్‌ లో 50 అసెంబ్లీ నియోజకవర్గాలు, తెలంగాణలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలని ఉంది. అయితే విభజన చట్టంలోని చిన్న మెలికను అప్పుడు గుర్తించక పోవడం వల్ల ఇప్పుడు సమస్య వచ్చి పడిందని తెలిసింది. విభజన చట్టంలో నియోజకవర్గాల పెంపు గురించి ఉన్నా, రాజ్యాంగంలోని 17వ నిబంధన మేరకు జరపాలని ఉంది. నియోజకవర్గాల పునర్విభజన 2009లోనే జరగడం వల్ల మరో రెండు దశాబ్దాల వరకు అవకాశం లేదు. అయితే విభజన చట్టంలోని ఆ మెలికను సవరిస్తూ పార్లమెంటులో తీర్మానం చేస్తే ఆంధ్ర - తెలంగాణ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు పెంచేలా విభజన చట్టంలో చేర్చారు. 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్న ఆంధ్రలో 50 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్న తెలంగాణలో 34 అసెంబ్లీ నియోజక వర్గాలు పెరిగే అవకాశం ఉంది.     కాగా నియోజకవర్గాలు పెంచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంతకు ముందే ప్రధానమంత్రికి లేఖ రాశారని టిఆర్‌ ఎస్ ఎంపీ వినోద్ కుమార్ చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సైతం కోరుతున్నందున రెండు రాష్ట్రాల అంగీకారం ఉంది కాబట్టి ప్రధానమంత్రి సుముఖత వ్యక్తం చేస్తే పార్లమెంటులో అరగంటలో పని అయిపోతుందని వినోద్ అంటున్నారు. గతంలో ఈ అంశంపై పట్టుపట్టలేదని, కానీ ఇప్పుడు అడుగుతామని చెప్పారు. కేంద్ర న్యాయశాఖ - హోంశాఖ మంత్రులను ఈ అంశంపై కలిసి డిమాండ్ చేస్తామని అంటున్నారు.
Tags:    

Similar News