ఎలానంటే..?:లాలూ దెయ్యమనేసిన మోడీ

Update: 2015-10-09 04:30 GMT
ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల మోడ్ లోకి వెళ్లినట్లు కనిపిస్తోంది. రాజకీయం గురించి తక్కువ మాట్లాడి.. స్వప్నాల గురించి ఎక్కువ మాట్లాడే ఆయన బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఆయనలోని ఫక్తు రాజకీయ నాయకుడు బయటకు వచ్చేశాడు. తమకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఎన్నికలు అయినందుకే కాబోలు.. ఇప్పటివరకూ ఉపయోగించనంత కరుకైన.. కటువైన మాటల్ని ఆయన ఉపయోగించినట్లుగా కనిపిస్తోంది.

దేశ వ్యాప్తంగా గో మాంసం మీద రచ్చ జరుగుతుంటే.. మోడీ తనదైన శైలిలో గో మాంసంపై లాలూకు ఊహించనంత భారీ దెబ్బేశారు. ఆయనకు బలమైన వర్గంగా ఉండే యాదవుల మనసుల్ని దోచుకునేలా ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా లాలూను విమర్శించేందుకు కాస్తంత హద్దులు దాటేసిన మోడీ.. తీవ్ర వ్యాఖ్యలే చేశారు. బీహార్ లోని మూడు ప్రాంతాల్లో (ముంగేర్.. బెగుసరాయ్.. సమస్తిపూర్)నిర్వహించిన ఎన్నికల సభల్లో పాల్గొన్న ఆయన.. లాలూను భారీగా.. నితీశ్ ను ఓ మోస్తరుగా విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.

యాదవులకు గోవు ఎంతో పవిత్రమని.. గోవుల పెంపకం వారి జీవనాధారమన్న మోడీ.. అలాంటి యదువంశాన్ని అవమానపరిచేలా లాలూ హిందువులూ గోమాంసాన్ని తింటారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలతో లాలూ.. యదువంశాన్నే కాదు బీహారీయులందరన్ని ఆయన అవమానపరిచారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

లాలూ దెయ్యం పట్టినట్లుగా మాట్లాడుతున్నారన్న మోడీ.. దెయ్యానికి లాలూ శరీరంలోనే దూరాలని ఎందుకు అనిపించిందో.. దానికి లాలూ అడ్రస్ ఎలా దొరికిందో తెలుసుకోవాలని ఉందంటూ చురకలు వేశారు. తన మాటలతో లాలూకు బలమైన ఓటుబ్యాంకుగా ఉండే యాదవుల్ని నేరుగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. వారిలోని సెంటిమెంట్ ను రాజేసి.. లాలూకు వ్యతిరేకంగా మార్చే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది.
Read more!

దీనికి నిదర్శనంగా ఆయన చేసిన మరిన్ని వ్యాఖ్యల్ని చెప్పొచ్చు. ‘‘ఈ రోజు లాలూ ఈ స్థానంలో ఉండటానికి కారణం యాదవులే. కానీ.. ఆయన వారిని అవమానించేలా మాట్లాడుతున్నారు. ఇప్పటివరూ రాజకీయ ప్రత్యర్థులతోనే యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు దెయ్యంతో పోరాడాల్సి వస్తోంది’’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

లాలూతో పాటు.. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ ను కూడా వదల్లేదు. తన జీవితం మొత్తం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడిన జేపీ ఆశీస్సులతో ఎదిగిన లాలూ.. నితీశ్ లిద్దరూ తమ రాజకీయ లబ్థి కోసం జేపీని జైల్లో పెట్టిన కాంగ్రెస్ తో చేతులు కలిపారంటూ మోడీ వ్యాఖ్యానించారు. మోడీ తాజా వ్యాఖ్యలతో బీహార్ ఎన్నికల రాజకీయం మరింత వేడెక్కినట్లే.
Tags:    

Similar News