రాయలసీమ లో మళ్లీ పడగవిప్పిన ఫ్యాక్షన్‌.. ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరుల దారుణ హత్య !

Update: 2021-06-19 11:30 GMT
రాయలసీమలో ఫ్యాక్షన్‌ మరోసారి పడగ విప్పింది. మొన్న కడప జిల్లా, నిన్న కర్నూలు జిల్లా, నేడు అనంతపురం జిల్లాలో ఒక్కసారి పాత కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో ఇద్దరు టిడిపి నేతలు దారుణ హత్యకు గురైన సంఘటన మరువకుముందే అనంతపురం జిల్లాలోనూ ఇద్దరు హత్యకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం అచ్యుతాపురంలో ఇద్దరు వైసిపి కార్యకర్తలను ప్రత్యర్థులు దారుణ హత్య చేశారు.

భూ వివాదంపై తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా అచ్యుతాపురం, వేటాపురం గ్రామాల మధ్య రాజగోపాల్‌, నారాయణప్పలపై ప్రత్యర్థులు దాడి చేసి హత్య చేశారు. దేవాలయ భూముల ఆక్రమణ విషయంలో గ్రామానికి చెందిన ఇరు వర్గాల మధ్య తలెత్తిన విభేదాలే ఈ హత్యకు కారణమని స్తానికులు చెబుతున్నారు. హత్యకు గురైన ఇద్దరూ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులని గ్రామస్తులు చెబుతున్నారు. విషయం తెలిసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తుతో గ్రామంలో పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.

కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో టీడీపీ నాయకులు వడ్డు ప్రతాప్‌ రెడ్డి, వడ్డు నాగేశ్వర్‌ రెడ్డి ప్రత్యర్థుల పాశవిక దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ప్రజలకు చేదోడుగా ఉండే ఇద్దరు విపక్ష నాయకులను వైసీపీ నాయకులు గురువారం ఉదయం దారుణంగా హత్య చేశారు. మొత్తం 13 మంది మూకుమ్మడిగా దాడి చేసి, హత్యలు చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రతాప్‌ రెడ్డి భార్య వడ్డు లక్ష్మీదేవమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాంత్‌ రెడ్డి, ఎల్లారెడ్డి, రాజారెడ్డితో పాటు మరో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై ఐపీసీ సెక్షన్లు 147, 148 324, 307, 302 (రెడ్‌ విత్‌ 149) కింద కేసు నమోదు చేశారు.
Tags:    

Similar News