ఏపీలో ఆ జిల్లాలో మంత్రి వ‌ర్సెస్ ఎమ్మెల్యే ఢీ అంటే ఢీ!

Update: 2020-10-06 14:30 GMT
ఏపీ రాజ‌కీయాల్లో చిత్ర‌మైన సంగ‌తులు తెర‌మీదికి వ‌స్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా అధికార వైసీపీలో రోజూ ఏదో ఒక సంచ‌ల‌న వార్త తెర‌మీద‌కి వ‌స్తూనే ఉంది. మంత్రుల గురించో.. ఎమ్మెల్యేల గురించో.. నిత్యం హాట్ టాపిక్ చోటు చేసుకుంటూనే ఉంది. ఈ క్ర‌మంలో తాజాగా వెలుగు చూసిన వార్త‌.. ప్ర‌భుత్వ కాంట్రాక్టుల‌ను కొంద‌రు మంత్రులు సొంత పార్టీకి చెందిన‌వారికి కాకుండా... టీడీపీకి చెందిన కాంట్రాక్ట‌ర్ల‌కు అప్ప‌గిస్తున్నార‌ట‌!  వాస్త‌వానికి ఏ ప్ర‌భుత్వంలోనైనా .. చిన్న చిన్న ప‌నుల‌ను త‌మ పార్టీకి చెందిన‌ వారికి అప్ప‌గించ‌డం స‌ర్వ‌సాధార‌ణం. కానీ, ఇక్క‌డ రివ‌ర్స్‌లో జ‌రుగుతోంద‌నే టాక్ వినిపిస్తోంది.

మ‌రి వైసీపీలోనే ఎందుకు ఇలా జ‌రుగుతోంది? అనేది ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న ప్ర‌శ్న‌. వైసీపీకి చెందిన కాంట్రాక్ట‌ర్లు.. క‌మీష‌న్ ఇవ్వ‌రు. కానీ, క‌మీష‌న్ ఇచ్చి ప‌నులు చ‌క్క‌పెట్ట‌డంలో ఆరితేరిన టీడీపీ కాంట్రాక్ట‌ర్లు అయితే.. ఇప్పుడు ఎలాగూ.. ఖాళీనే క‌దా.. అని అడిగినంత స‌మ‌ర్పించి ప‌నులు ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. నిజానికి ఈ త‌ర‌హా ప‌రిస్థితి ఏపీకే ప‌రిమితం కాలేదు. టీడీపీకి చెందిన బ‌డా పారిశ్రామిక వేత్త‌లు.. ఢిల్లీలో బీజేపీలో కూడా ఇలానే న‌డిపిస్తున్నార‌నే టాక్ ఉంది. ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్న కొంద‌రు జూనియ‌ర్ ఎమ్మెల్యేల‌కు ప‌నుల‌పై అంత‌గా అవ‌గాహ‌న లేక‌పోవ‌డం... టీడీపీకి చెందిన కాంట్రాక్ట‌ర్ల‌కు వ‌రంగా మారింది.

దీంతో టీడీపీకి చెందిన కాంట్రాక్ట‌ర్లు.. మంత్రులు, ఎమ్మెల్యేల ప‌క్క‌న చేరి.. పెత్త‌నం చేస్తున్నార‌నే టాక్ జోరుగా వినిపిస్తోంది.  అస‌లు విష‌యం ఏంటంటే.. ఒక జిల్లాలోని ఓ నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు ప‌ది వేల ఎక‌రాల‌కు సాగు నీరు, 30 గ్రామాల‌కు తాగు నీరు అందించే నీటి పారుదల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. వాస్త‌వానికి ఇది కిర‌ణ్ కుమార్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్ప‌టి ప్రాజెక్టు. పైగా ప్ర‌పంచ బ్యాంకు నిధుల‌తో నిర్మించే ప్రాజెక్టు. అయితే, అప్ప‌ట్లో ఉన్న ఎమ్మెల్యేనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎస్టిమేష‌న్ వేయించారు కానీ, అనూహ్యంగా ఈ ప్రాజెక్టుకు నిధులు రాలేదు.

అప్ప‌టి నుంచి ఈ ప్రాజెక్టు ప‌రిస్థితి రెండు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెన‌క్కి అన్న చందంగా మారింది. త‌ర్వాత టీడీపీ ప్ర‌బుత్వం వ‌చ్చినా.. ఆ పార్టీ ఎమ్మెల్యే కూడా దీనిని ముందుకు సాగించ‌లేక పోయారు. అయితే, వ‌ర్షాలు బాగా ప‌డుతుండ‌డంతో వైసీపీ ప్ర‌భుత్వం ఇక్క‌డ మ‌రోసారి అంచ‌నాలు వేసి.. బ్యాంకుకు పంపించారు. దీనికి బ్యాంకు  ఓకే చెప్పింది. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. అస‌లు ట్విస్ట్ ఇక్క‌డ నుంచి మొద‌లైంది. ఈ ప్రాజెక్టు ప‌రిధిలోకి వ‌చ్చే నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఎమ్మెల్యే స్వ‌త‌హాగా కాంట్రాక్ట‌ర్‌. దీంతో ఆయ‌నే చేసుకుందాం.. అనుకుని నియోజ‌క‌వ‌ర్గంలోని వైసీపీకి చెందిన కాంట్రాక్ట‌ర్ల నుంచి క‌మీష‌న్ తీసుకోలేదు.

అదేస‌మ‌యంలో స‌ద‌రు ఎమ్మెల్యే తానే స్వ‌యంగా టెండ‌ర్ వేశారు. ఇక్క‌డ వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇక్క‌డ  ఆ జిల్లాకు చెందిన మంత్రి.. ఒక‌రు ఆయా ప‌నుల‌ను టీడీపీకి చెందిన బ‌డా కాంట్రాక్ట‌ర్‌కు అప్ప‌గించి.. క‌మీష‌న్ నొక్కేసిన‌ట్టు స‌ద‌రు ఎమ్మ‌ల్యేకు తెలిసింది. దీంతో ఆయ‌న అగ్గిమీద గుగ్గిలం మాదిరిగా మంత్రిపై మండి ప‌డుతున్నారు. అంతేకాదు.. టీడీపీ వాళ్ల‌కు ప‌నులు అప్ప‌గించి.. వారు డెవ‌ల‌ప్ కావ‌డం వ‌ల్ల మ‌న‌కేంటి(వైసీపీ) లాభం అని స‌ద‌రు ఎమ్మెల్యే ప్ర‌శ్నిస్తున్నారు. పోనీ వైసీపీ వాళ్ల‌కు ఇస్తే.. రేపు పార్టీకి సేవ చేస్తార‌ని ఎమ్మెల్యే అంటున్నారు .

ఇదే విష‌యంపై స‌ద‌రు మంత్రిని కూడా ఆయ‌న నిల‌దీసిన‌ట్టు తెలిసింది. కానీ, మంత్రి మాత్రం టీడీపీ వాళ్ల‌కు మాట ఇచ్చాను.. అని స‌ద‌రు ఎమ్మెల్యేను అవ‌మానించి పంపించార‌ట‌! అయితే స‌ద‌రు ఎమ్మెల్యే ఈ విష‌యాన్ని అక్క‌డితో వ‌దిలి పెట్ట‌కుండా.. పార్టీలో హైక‌మాండ్‌కు అత్యంత స‌న్నిహితంగా ఉన్న ఓ మంత్రి ద‌గ్గ‌ర‌కు ఈ విష‌యాన్ని తీసుకువెళ్లారు. అయినా ఈ విష‌యం లో స‌ద‌రు ఎమ్మెల్యే అనుకున్న విధంగా ప‌నికాలేదు. దీంతో ఎమ్మెల్యే అయి కూడా ఏం లాభం.. అని అనుకుని ఏకంగా నియోజ‌క‌వ‌ర్గంలోనే లేకుండా వెళ్లిపోయార‌ట‌! ఇదంతా టీడీపీ వాళ్ల వ‌ల్లేన‌ని అంద‌రూ అనుకోవ‌డం గ‌మ‌నార్హం. 
Tags:    

Similar News