పీఎస్ఎల్ లో వింత ఘటన: బౌలర్ ఆగితే.. నేనూ ఆగుతా.. పాక్ స్పిన్నర్ తారిఖ్‌కు డారిల్ మిచెల్ మైండ్ గేమ్ షాక్

తాజాగా క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక వింత పోరాటం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.;

Update: 2026-04-11 07:30 GMT

క్రికెట్ మైదానమా లేక 'స్టాచ్యూ-స్టాచ్యూ' ఆట స్థలమా అన్నట్లుగా సాగింది పాకిస్థాన్ సూపర్ లీగ్ వేదిక. బౌలర్ ఉస్మాన్ తారిఖ్ బంతి వేయబోతూ బ్రేక్ వేస్తే.. 'నీ దగ్గర బ్రేకులు ఉంటే నా దగ్గర గేర్లు ఉన్నాయి' అన్నట్లుగా బ్యాటర్ డారిల్ మిచెల్ క్రీజు వదిలి వాకింగ్‌కు వెళ్ళిపోయాడు. అటు బౌలర్ వింత యాక్షన్.. ఇటు బ్యాటర్ రియాక్షన్ చూస్తుంటే.. వీరు క్రికెట్ ఆడుతున్నారా లేక ఒకరి సహనాన్ని మరొకరు పరీక్షించుకునే 'బిగ్ బాస్' టాస్క్ ఆడుతున్నారా అని ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు..

పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) అంటేనే సంచలనాలు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ప్రస్తుత సీజన్‌లో బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు.. అంపైరింగ్ లోపాలు ఇప్పటికే టోర్నీ ప్రతిష్టను మసకబారుస్తుండగా.. తాజాగా క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక వింత పోరాటం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ తన విలక్షణమైన బౌలింగ్ యాక్షన్‌తో బ్యాటర్‌ను ఇబ్బంది పెట్టాలని చూడగా న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ తనదైన శైలిలో అతనికి చుక్కలు చూపించాడు.

ఏం జరిగిందంటే?

మ్యాచ్ 9వ ఓవర్ వేసేందుకు ఉస్మాన్ తారిఖ్ సిద్ధమయ్యాడు. తారిఖ్ బౌలింగ్ శైలి చాలా విభిన్నంగా ఉంటుంది. అతను రనప్ పూర్తి చేసి బంతిని విసిరే ముందు ఒక్క క్షణం ఆగి.. బ్యాటర్ కదలికలను గమనించి ఆ తర్వాత డెలివరీ చేస్తాడు. దీనివల్ల బ్యాటర్ టైమింగ్ దెబ్బతింటుంది. అయితే డారిల్ మిచెల్ దీనిని ఏమాత్రం సహించలేదు. తారిఖ్ బంతిని విసిరే క్రమంలో ఆగిపోగానే, మిచెల్ కూడా బ్యాటింగ్ గార్డ్ వదిలేసి క్రీజు పక్కకు తప్పుకున్నాడు. "నువ్వు ఆగితే.. నేనూ ఆగుతా" అన్నట్లుగా మిచెల్ ప్రవర్తించడం మైదానంలో నవ్వులు పూయించడమే కాక తీవ్ర చర్చకు దారితీసింది.

అంపైర్ల జోక్యం.. ఉత్కంఠభరిత సన్నివేశాలు

మిచెల్ ఒకసారి కాదు.. వరుసగా రెండుసార్లు ఇలాగే క్రీజు నుంచి తప్పుకోవడంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. "ఇలా ఆగి ఆగి బౌలింగ్ చేయడం వల్ల ఏకాగ్రత దెబ్బతింటోంది, ఇలాంటి యాక్షన్‌ను నేను ఎదుర్కోను" అని మిచెల్ అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. పరిస్థితి చేయి దాటుతుండటంతో అంపైర్లు జోక్యం చేసుకుని మిచెల్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఐసీసీ నిబంధనల ప్రకారం బౌలర్ యాక్షన్ సక్రమంగా ఉన్నంత వరకు అభ్యంతరం చెప్పలేమని వారు సూచించారు. అయినప్పటికీ నాలుగో బంతి సమయంలో మళ్ళీ ఇదే సీన్ రిపీట్ కావడంతో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

వివాదంలో తారిఖ్ బౌలింగ్ యాక్షన్

ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్‌పై గతంలోనూ విమర్శలు వచ్చాయి. బంతిని రిలీజ్ చేసే ముందు అతను చూపే విరామం బ్యాటర్‌ను తప్పుదారి పట్టించేలా ఉందని ఇది 'ఫెయిర్ ప్లే' కిందకు రాదని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ వంటి వారు అభిప్రాయపడ్డారు. కొందరు దీనిని 'త్రోయింగ్' అని కూడా విమర్శిస్తుండగా మరికొందరు ఇది ఒక తెలివైన వ్యూహమని సమర్థిస్తున్నారు. గతంలో జింబాబ్వేపై హ్యాట్రిక్ సాధించి కామెరాన్ గ్రీన్ వంటి దిగ్గజాలను బురిడీ కొట్టించిన తారిఖ్ ఈ వింత యాక్షన్‌తోనే వార్తల్లో నిలుస్తున్నాడు.

నియమాలపై స్పష్టత అవసరమా?

ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్రికెట్ నిపుణులు సరికొత్త చర్చను లేవనెత్తారు. బౌలర్ తన యాక్షన్‌తో బ్యాటర్‌ను గందరగోళానికి గురిచేయడం చట్టబద్ధమేనా? లేదా ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐసీసీ లేదా టోర్నీ నిర్వాహకులు ఇలాంటి 'స్టాప్-స్టార్ట్' బౌలింగ్ యాక్షన్లపై స్పష్టమైన నిబంధనలు తీసుకురావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఏది ఏమైనా మిచెల్ చూపించిన తెగువ మాత్రం "మైండ్ గేమ్‌ను మైండ్ గేమ్‌తోనే ఎదుర్కోవాలి" అని నిరూపించింది.



Tags:    

Similar News