రఫేల్ డీల్ పై ‘మీడియా పార్ట్’ సంచలన కథనం.. అందులో ఏముంది?

Update: 2021-04-06 06:12 GMT
మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇరుకున పడేలా జరిగిన డీల్ ఏదైనా ఉందంటే అది.. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు. దీనిపై మోడీ సర్కారు ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ.. ఆ పార్టీకి పెద్ద ఇబ్బందిగా మారలేదు. దీని విచారణ సందర్భంగా తమకు సంబంధం లేదన్నట్లుగా మోడీ సర్కారు వ్యవహరించింది. ఇదిలా ఉంటే.. ఈ డీల్ కు సంబంధించి.. రఫేల్ యుద్ధ విమానాల్ని తయారుచేసే దసాల్ట్ సంస్థ.. మధ్యవర్తులకు భారీ మొత్తాన్ని ఇచ్చినట్లుగా ఆరోపణల్ని ఎదుర్కొంటోంది.

ఇందుకు తగ్గట్లే.. ‘మీడియా పార్ట్’ అనే మీడియా సంస్థ  ఒక సంచలనాత్మక కథనాన్ని పబ్లిష్ చేసింది. అదిప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. కొత్త చర్చకు తెరతీసింది. ఫ్రెంచ్ ఆన్ లైన్ ఇన్వెస్టిగేటివ్ జర్నల్ అయిన ఈ మీడియా సంస్థ.. తమ వాదనకు బలం చేకూరేందుకు వీలుగా పలు అంశాల్ని ప్రస్తావిస్తోంది. సదరు సంచలన కథనంలో ఏముందన్న విషయంలోకి వెళితే..

-  ఫ్రాన్స్ కు చెందిన దసాల్ట్  సంస్థ రఫేల్ యుద్ధ విమానాల్ని తయారు చేస్తుంది. వీటిని భారత్ కు అమ్మేందుకు వీలుగా డీల్ కుదిరింది. ఈ డీల్ ను కుదిర్చేందుకు భారత్ లోని మధ్యవర్తులైన సుశేన్ గుప్తాకు దసాల్ట్ సంస్థ రూ.9.5 కోట్ల మొత్తాన్ని కమీషన్ గా ఇచ్చింది.

-  ఫ్రాన్స్‌ అవినీతి నిరోధక శాఖ ఏజెన్సీ ఫ్రాంకాయిస్‌ యాంటీ కరప్షన్‌(ఏఎఫ్‌ఏ) ఆడిటింగ్‌లో ఈ విషయం తేలింది. 2017 నాటికి దసాల్ట్‌ ఖాతాలను ఏఎఫ్‌ఏ పరిశీలించగా అవకతవకలు బయటపడ్డాయి. ‘గిఫ్ట్‌ టు క్లయింట్స్‌’ కింద భారీగా ఖర్చును దసాల్ట్‌ చూపించింది.

- ఈ కథనాన్ని దసాల్ట్ సంస్థ ఖండించింది. తాము ముడుపులు ఎవరికీ ఇవ్వలేదని.. 50 రఫేల్ ఫైటర్ జెట్ల ప్రతిరూపాల్ని తయారు చేసి ఇవ్వటానికి ఈ మొత్తాన్ని ఇచ్చామని పేర్కొంది. అయితే.. ఇప్పుడు తెర మీదకు వచ్చిన సుశేన్ గుప్తా గతంలో అగస్టా - వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలోనూ సీబీఐ విచారణను ఎదుర్కొనటం గమనార్హం.

-  దసాల్ట్ సంస్థ చేస్తున్న వాదనను మీడియా పార్ట్ తన కథనంలో పదునైన ప్రశ్నల్ని సంధించింది. ఒక్కో రఫేల్‌ నమూనా తయారీకి 20,357 యూరోలు ఖర్చయిందని దసాల్ట్‌ చెబుతోంది. సొంత ఎయిర్‌క్రాఫ్ట్‌ మోడల్‌ను తయారు చేయడానికి ఒక భారతీయ కంపెనీకి ఆర్డర్‌ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది?

-   ఒక్కొక్కటి ఒక కారు పరిమాణంలో తయారు చేశారా?ఈ ఖర్చును ‘గిఫ్ట్‌ టు క్లయింట్‌’ కింద ఎందుకు చూపారు? అయినా నమూనాల తయారీకి అంత సొమ్ము ఎందుకు?
Tags:    

Similar News