రఘురామ రాజుపై విమర్శలు.... టీడీపీ నేత ఇంటి కూల్చివేతపై హాట్ టాపిక్!

డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేత పొత్తూరి వెంకటేశ్వరరాజు ఇళ్లు, కార్యాలయాన్ని అధికారులు కూల్చివేశారు.;

Update: 2026-02-21 11:38 GMT

డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేత పొత్తూరి వెంకటేశ్వరరాజు ఇళ్లు, కార్యాలయాన్ని అధికారులు కూల్చివేశారు. ఇరిగేషన్ భూములను ఆక్రమించి ఇంటిని నిర్మించారని శుక్రవారం సాయంత్రమే వెంకటేశ్వరరాజుకు అధికారులు నోటీసులు జారీ చేశారు. శనివారం ఉదయమే వచ్చి ఆక్రమణలను జేసీబీలతో తొలగించారు. ఈ చర్య రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుపై విమర్శలు చేయడంతో ప్రతీకారంగా టీడీపీ నేత ఇంటిని కూల్చివేశారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ నేతపైనే రఘురామ ప్రతాపం చూపడంపై కార్యకర్తల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.

ఉండి నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారని కొద్దిరోజులుగా వెంకటేశ్వరరాజు విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. రఘురామపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ కు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ నుంచి తనను రక్షించాలని వేడుకున్నాడు. అధికార పార్టీలో పొత్తూరి ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, పార్టీ నేత నుంచి డిప్యూటీ స్పీకర్ ఆరోపణలు ఎదుర్కోవడంపై విస్తృత చర్చ జరిగింది.

గత మంగళవారం డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుపై టీడీపీ నేత పొత్తూరి ఆరోపణలు చేయగా, శుక్రవారం సాయంత్రం ఉండి మండలంలోని వెలిపర్రులో ఉన్న వెంకటేశ్వరరాజు ఇంటిని కూల్చేస్తామంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. ముందుగా నోటీసు ఇచ్చినట్లే శనివారం ఉదయం ఇంటిని కూల్చేశారు. ఇలా ముందస్తు వ్యూహంతోనే డిప్యూటీ స్పీకర్ రఘురామ తనపై విమర్శలు చేసిన వెంకటేశ్వరరాజు ఇంటిని కూల్చేలా స్కెచ్ వేశారని విమర్శలు వస్తున్నాయని అంటున్నారు. బాధితుడు కోర్టును ఆశ్రయించే వీలు లేకుండా చేయడానికి అధికారులు శుక్ర, శనివారాలను ఎంచుకున్నట్లు చెబుతున్నారు.

కాగా, తన ఇల్లు, కార్యాలయం కూల్చివేతపై బాధితుడు వెంకటేశ్వరరాజు తీవ్రంగా నిరసించారు. జేసీబీలతో కూల్చివేతలు జరుగుతున్న సమయంలో పసుపు చొక్కానే ధరించి తన ఆవేదన వెళ్లగక్కారు. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజును విమర్శించినందునే తన ఇల్లు ఆక్రమిత భూమిలో ఉందని గుర్తు వచ్చిందా? అంటూ నిలదీశారు. తన ఇంటి పక్కనే ఉన్న నివాసాల సంగతేంటి? అంటూ ప్రశ్నించారు. ఆయన అలా తన ఆవేదన వెల్లగక్కినా ఎవరూ పట్టించుకోలేదని చెబుతున్నారు. ఈ పరిణామంతో తీవ్రంగా కలత చెందిన బాధితుడు వెంకటేశ్వరరాజు అనారోగ్యానికి గురయ్యాడు.

కళ్ల ముందే ఇంటిని కూల్చేయడం తట్టుకోలేక కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు భీమవరంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వెంకటేశ్వరరాజు చికిత్స పొందుతున్నారు. ఉండి నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఈ ఘటన రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. సొంత పార్టీ కార్యకర్తపై ఇలాంటి చర్య తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధిష్టానానికి తెలిసే ఈ చర్య తీసుకున్నారా? లేక రఘురామ స్వతంత్రంగా నిర్ణయించుకుని ఇలా చేశారా? అన్నది తెలియడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. విమర్శలు చేసిన వెంకటేశ్వరరాజును పిలిచి మాట్లాడి, అతడి సమస్య ఏంటో తెలుసుకుంటే బాగుణ్ణు కదా అంటూ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. పార్టీ గెలుపు కోసం కష్టపడని కార్యకర్తల విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్టు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Tags:    

Similar News