రాజకీయ ఏకాత్మత... లోకేష్ పొలిటికల్ స్ట్రాటజీ!
మనసు విప్పి మాట్లాడుకోవడం అనేది.. రాజకీయాల్లో చాలా వరకు కష్టం. ఎంత సొంత పార్టీ నాయకులు అయినా.. ఎక్కడో ఒక సందర్భంలో మనసులో ఉన్నది చెప్పడానికి జంకుతారు.;
మనసు విప్పి మాట్లాడుకోవడం అనేది.. రాజకీయాల్లో చాలా వరకు కష్టం. ఎంత సొంత పార్టీ నాయకులు అయినా.. ఎక్కడో ఒక సందర్భంలో మనసులో ఉన్నది చెప్పడానికి జంకుతారు. ఫలితంగా పొలిటికల్‌గా గ్యాప్ పెరుగుతుంది. ఇది సర్వసాధారణంగా మారిపోయింది. అందుకే.. సమయం చూసుకుని నేతలు.. అధినేతలు కలుసుకునే సందర్భం కోసం వేచి చూస్తారు. కానీ.. అది కూడా ఎప్పుడో కానీ సాధ్యం కాదు. దీంతో సొంత పార్టీల్లోనే చికాకులు.. చిరాకులు పెరుగాయి. ఎన్నికల నాటికి ఇవి పెరుగుతాయి.
అందుకే.. అమెరికా వంటి దేశాల్లో అధికార పార్టీ నాయకులు రౌండ్ టేబుల్ డిన్నర్‌లకు ప్రాధాన్యం ఇస్తారు. తద్వారా.. తమ పార్టీ నాయకులు, మంత్రులతో చర్చించేందుకు అవకాశం ఇస్తారు. ఇప్పుడు ఇదే ఫార్ములాను తొలిసారి మంత్రి నారా లోకేష్ అవలంభిస్తున్నారు. ప్రస్తుతం కూటమి పార్టీలు ఏపీలో ప్రభు త్వాన్నినడుపుతున్నాయి. ఇది ఒక్కసారితో పోయేది కాదు. మరో 15 సంవత్సరాల పాటు ఉండాలని కూటమినాయకులు కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో రాజకీయంగా ఆయా పార్టీల నాయకుల మధ్య ఏకత్వాన్ని తీసుకువచ్చేందుకు.. వారి అభి ప్రాయాలను.. విషయాలను తెలుసుకునేందుకు నారా లోకేష్ ప్రాధాన్యం ఇస్తున్నారు. నియోజకవర్గాల వారీగా మూడు పార్టీల నాయకులు, మంత్రులతోనూ ఆయన విందు సమావేశాలను నిర్వహిస్తున్నారు. కానుకలు కూడా ఇస్తున్నారు. తద్వారా.. రాజకీయ ఏకాత్మతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సమస్యలు తెలుసుకుంటున్నారు. వ్యక్తిగత కుటుంబ సభ్యుల వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. తద్వారా.. నాయకులకు -నాయకులకు మధ్య విభేదాలు రాకుండా పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు.
తాజాగా..శుక్రవారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో సతీమణి బ్రాహ్మణితో కలిసి రాజమండ్రి, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేల కుటుంబాలకు లోకేష్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా అందరినీ ఆయన ఆత్మీయంగా పలకరించారు. వారికి మంగళగిరి చేనేత వస్త్రాలను బహూకరించారు. పలువురు ఎమ్మెల్యేలు.. తమ ప్రాంతానికి చెందిన విశేష వస్తువులను మంత్రి నారా లోకేష్‌కు, ఆయన సతీమణి బ్రాహ్మణికి కానుకలుగా తీసుకువచ్చారు. ఇలా.. రాజకీయ ఏకాత్మత కోసం లోకేష్ చేస్తున్న వ్యూహాత్మక ప్రయత్నంతో కూటమి మరింత బలోపేతం అవుతుందన్న చర్చసాగుతోంది.