హేమంత్ పరువు హత్యలో మరో సంచలనం

Update: 2020-09-30 08:50 GMT
ఇటీవల సంచలనం సృష్టించిన ‘హేమంత్’ పరువు హత్యలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. హేమంత్-అవంతిలను విడదీయాలనే ఉద్దేశంతో ఆమె మేనమామ భారీ కుట్రలకు పాల్పడ్డట్టు తెలిసింది. హేమంత్-అవంతి పెళ్లైన నెల రోజులకే  ఓ సుపారీ గ్యాంగ్ తో అవంతి మేనమామ డీల్ కుదుర్చుకున్నట్టు వెల్లడైంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. హేమంత్ ను కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా అవంతిని విడదీసేందుకు ఆ సుపారీ గ్యాంగ్ తో యుగంధర్ రెడ్డి రూ.10 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. పలుసార్లు రెక్కీ కూడా నిర్వహించినట్టు తెలిసింది. అయితే ఆ గ్యాంగ్ ఏవేవో కారణాలతో హేమంత్ కిడ్నాప్ ను వాయిదా వేస్తూ వచ్చింది.

దీంతో అవంతి మేనమామ యుగంధర్ రెడ్డి ‘బిచ్చూ యాదవ్ గ్యాంగ్’ను సంప్రదించాడు. వాళ్లతో ఏకంగా హేమంత్ కిడ్నాప్, హత్యకు ప్లాన్ చేశాడు. 24న గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో ఉన్న అతడి ఇంటికి అవంతి ఫ్యామిలీ వెళ్లారు. హేమంత్-ఆవంతిలను మాట్లాడుకుందాం రమ్మని చెప్పి కారులో ఎక్కించుకున్నారు. కానీ మార్గ మధ్యలోనే కారును ఓఆర్ఆర్ వైపు తిప్పడంతో ఇద్దరూ కిందకు దూకే ప్రయత్నం చేశారు. అవంతి తప్పించుకోగా.. హేమంత్ ను కిరాయి మనుషులు కొట్టుకుంటూ తీసుకెళ్లి కారు ఎక్కించుకొని మెడకు తాడు బిగించి హత్య చేశారు.

గత శుక్రవారం 25న హేమంత్ ను హత్యచేసి సంగారెడ్డి సమీపంలో రోడ్డుపక్కన పడేసిన సంగతి తెలిసిందే. అవంతి కులాంతర వివాహం చేసుకోవడంతో రగిలిపోయిన ఆమె తల్లి, తండ్రి, లక్ష్మారెడ్డిలే ఈ హత్య చేయించినట్లు తేలింది. లక్ష్మారెడ్డి బావమరిది, అవంతి మేనమామ యుగంధర్ ఈ మొత్తం హత్య ప్లాన్ ను అమలు చేశాడు. ఈ కేసులో ఇప్పటివరకు 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Tags:    

Similar News