ట్రంప్ ను వెర్రి వెంగలప్పను చేసిన ఇరాన్
కానీ ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్ల సీజ్‌ఫైర్ డాక్యుమెంట్‌లో వెలుగు చూసిన విషయాలు చూస్తుంటే ట్రంప్ యంత్రాంగం ఇరాన్ వేసిన వ్యూహాత్మక ఉచ్చులో చిక్కుకుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి;
అంతర్జాతీయ ఒప్పందాలు అంటే ప్రతి పదం.. ప్రతి అక్షరం ఆచితూచి వాడుతుంటారు. కానీ ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్ల సీజ్‌ఫైర్ డాక్యుమెంట్‌లో వెలుగు చూసిన విషయాలు చూస్తుంటే ట్రంప్ యంత్రాంగం ఇరాన్ వేసిన వ్యూహాత్మక ఉచ్చులో చిక్కుకుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రముఖ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) వెల్లడించిన కథనం ప్రకారం.. ఈ ఒప్పందంలోని పార్సీ (ఫార్సీ) , ఇంగ్లీష్ వెర్షన్ల మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నాయి.
అసలేం జరిగింది? ఆ తేడాలేంటి?
ఒప్పంద పత్రంలోని పార్సీ వెర్షన్‌లో "యురేనియం శుద్ధిపై ఇరాన్‌కు ఉన్న సార్వభౌమ హక్కును అంతర్జాతీయ సమాజం గుర్తించాలి" అనే నిబంధన చాలా స్పష్టంగా ఉంది. అయితే విస్మయానికి గురిచేసే విషయం ఏమిటంటే, అదే పాయింట్ ఇంగ్లీష్ వెర్షన్‌లో అసలు లేనే లేదు. యురేనియం అనేది అణ్వాయుధాల తయారీకి గుండెకాయ వంటిది. దీనిపై హక్కును గుర్తించడమంటే ఇరాన్ అణు కార్యక్రమాలకు అమెరికా పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అవుతుంది. ఇంగ్లీష్ వెర్షన్ చదివిన అమెరికా ప్రతినిధులు అంతా సవ్యంగానే ఉందని భావించి సంతకం చేస్తే ఇరాన్ మాత్రం తన స్థానిక భాషా పత్రంలో తనకు అనుకూలమైన నిబంధనలను చొప్పించి "అమెరికానే దీనికి అంగీకరించింది" అని తన ప్రజలకు, మిత్రదేశాలకు చెప్పుకునే అవకాశం దక్కించుకుంది.
ట్రంప్ వైఖరిపై విమర్శలు
ఈ పరిణామం డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాత్మక శక్తిపై ఆయన బృందం యొక్క సమర్థతపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అంతర్జాతీయ స్థాయి ఒప్పందాలు జరిగేటప్పుడు ట్రాన్స్‌లేషన్ విషయంలో క్రాస్-చెక్ చేసుకోకపోవడం ఒక చారిత్రక తప్పిదంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్‌ను దారికి తెచ్చానని ప్రగల్భాలు పలికిన ట్రంప్ చివరకు వారి భాషా వ్యూహంలో "వెర్రి వెంగలప్ప" అయ్యారా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ ఒప్పందం వెనుక పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఉందని ట్రంప్ స్వయంగా ప్రకటించడం కూడా పలు దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి ఇది అమెరికా గౌరవప్రదంగా వెనక్కి తగ్గడానికి ఎంచుకున్న దారి అని కొందరు అంటున్నా ఇరాన్ మాత్రం దీనిని తన విజయంగా మార్చుకుంది.
వ్యూహాత్మక తెలివితేటలు చూపిన ఇరాన్
ఇరాన్ ఈ విషయంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించింది. ఒకే పత్రానికి రెండు భాషల్లో రెండు రకాల అర్థాలు వచ్చేలా రూపొందించడం ద్వారా అంతర్జాతీయ సమాజానికి తాము శాంతిని కోరుకుంటున్నట్లు ఇంగ్లీష్ వెర్షన్ ద్వారా నమ్మించింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని, అణు హక్కులను కాపాడుకున్నామని పార్సీ వెర్షన్ ద్వారా తన దేశస్థులకు హామీ ఇచ్చింది.
ఈ ఘటన అంతర్జాతీయ దౌత్యరంగంలో ఒక పాఠం వంటిది. దేశాధినేతలు సంతకాలు చేసే ముందు ప్రతి చిన్న విషయాన్ని లోతుగా విశ్లేషించకపోతే ఎంతటి నవ్వులపాలవ్వాలో ఈ "ట్రంప్-ఇరాన్" వివాదం స్పష్టం చేస్తోంది. ఇరాన్ వేసిన ఈ వ్యూహాత్మక ఎత్తుగడ ముందు ట్రంప్ యంత్రాంగం తేలిపోయిందనేది ఇప్పుడు జగమెరిగిన సత్యం. భాషా వ్యత్యాసాల సాకుతో ఇరాన్ ఒక పెద్ద దౌత్య యుద్ధంలో విజయం సాధించినట్లయ్యింది.