సీఈసీపై అభిశంసన తీర్మానం.. కేంద్రాన్ని రక్షించిన ఆ ఇద్దరు?

కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై అభిశంసన తీర్మానం తిరస్కరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, స్పీకర్ ఓం బిర్లా కాపాడినట్లు వ్యాఖ్యానిస్తున్నారు.;

Update: 2026-04-08 12:30 GMT

కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై అభిశంసన తీర్మానం తిరస్కరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, స్పీకర్ ఓం బిర్లా కాపాడినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. అభిశంసన తీర్మానం నెగ్గించుకునే బలం లేకపోయినా, విపక్షాలు తగిన సంఖ్యాబలంతో నోటీసు ఇచ్చాయి. అయితే ఉప రాష్ట్రపతి, స్పీకర్ తమ విశిష్ట అధికారాలను ఉపయోగించి ఆ నోటీసులను తిరస్కరించడం ద్వారా ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు వ్యూహాత్మకంగా కేంద్రం పైచేయి సాధించిందని విశ్లేషిస్తున్నారు.

ఎన్నికల కమిషన్ పనితీరుపై దేశంలోని 8 విపక్ష పాలిత రాష్ట్రాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. దీంతో ఎన్నడూ లేనట్లు కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నోటీసుపై 130 మంది లోక్‌సభ సభ్యులు సంతకాలు చేశారు. అదేవిధంగా 63 మంది రాజ్యసభ సభ్యులు కూడా నోటీసుపై సంతకం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినట్లు ప్రచారం జరిగింది. నిజానికి ఈ తీర్మానంపై చర్చ జరిగితే కేంద్రం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితి ఉండేదని అంటున్నారు.

విపక్షాల అభిశంసనతో సీఈసీ జ్ఙానేష్ కుమార్ పదవికి వచ్చే ముప్పు ఏమీ ఉండదని, కానీ నోటీసుపై సభలో చర్చ జరగడం ద్వారా ఎన్నికల కమిషన్ పనితీరుపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పేంచేవని, ఈ పరిణామం ఐదు రాష్ట్రాల ఎన్నికలలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండేదని అంటున్నారు. ఈ ఇబ్బందిని ముందే గుర్తించిన కేంద్రం సభాధ్యక్షుల ద్వారా నోటీసును తిరస్కరించేలా వ్యూహాత్మకంగా పావులు కదిపిందని అంటున్నారు.

ఉభయ సభల సభాధ్యక్షుల కారణంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ పదవికి ఉన్న ముప్పు ప్రస్తుతానికి తొలగిపోయినట్లే అంటున్నారు. అయితే ఈ నోటీసు ద్వారా విపక్షాల సీఈసీ పనితీరును ప్రజల ముందు ఉంచడంలో సక్సెస్ అయ్యాయని అంటున్నారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణలో కేంద్ర ఎన్నికల సంఘం భారీగా అక్రమాలకు పాల్పడిందని విపక్షాలు కొంతకాలంగా ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా 50 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) ప్రక్రియ అధికార బీజేపీకి అనుకూలంగా, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా సాగిందని లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ వంటి అగ్రనేతలు విమర్శలు గుప్పించారు. బీహార్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఓటర్ల తొలగింపుపై పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తాయి.

Tags:    

Similar News