త‌ల్లికి పిండం పెడుతూ వైర‌స్‌ తో కుమారుడు క‌న్నుమూత‌!

Update: 2020-07-27 03:15 GMT
మ‌హ‌మ్మారి వైర‌స్ క‌ల్లోలం రేపుతోంది. ఏపీలో ల‌క్ష‌కు చేరువ‌గా కేసులు.. మృతుల సంఖ్య వేలకు చేరింది. ఆ వైర‌స్ ఎన్నో విషాదాలు నింపుతోంది. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లి మృతి చెంద‌గా ఆమె అంత్య‌క్రియ‌లు పూర్త‌య్యాయి. అనంత‌రం నిర్వ‌హించే పిండ ప్ర‌దానం కార్య‌క్ర‌మంలో ఆమె కుమారుడు కన్నుమూయ‌డం క‌లచివేసింది. అత‌డు వైర‌స్ బారిన ప‌డి మృతిచెంద‌డం క‌ల‌క‌లం రేపింది. దీనికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి..

ప‌శ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం తూర్పువిప్పర్రుకు చెందిన శ్రీనివాస్‌ తల్లి 11 రోజుల కింద‌ట చనిపోయింది. ఆదివారం పిండ ప్ర‌దానం చేస్తున్నాడు. ఈ కార్య‌క్ర‌మానికి కుటుంబ‌స‌భ్యులు.. బంధువులు హాజ‌ర‌య్యారు. పిండం పెడుతుండ‌గా శ్రీనివాస్‌ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఏం జ‌రిగిందా అని కుటుంబ‌స‌భ్యులు.. బంధువులు అత‌డిని లేప‌గా అప్ప‌టికే మృతిచెందాడు. దీంతో ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. త‌ల్లి పిండ ప్ర‌దానం నాడే కుమారుడు మృతి చెంద‌డం బంధువుల‌ను క‌ల‌చివేసింది. ఈ స‌మ‌యంలో కుటుంబ‌స‌భ్యులు అధికారులకు సమాచారం అందించారు.

ఈ క్ర‌మంలో అధికారులు శ్రీనివాస్ మృతదేహానికి టెస్ట్‌లు నిర్వహించగా అతడికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ కుటుంబసభ్యులంతా షాక్‌కు గుర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కుటుంబ‌స‌భ్యుల‌కు కూడా పరీక్షలు చేశారు. అయితే శ్రీనివాస్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవ‌రూ ముందుకు రాలేదు. దీంతో కుటుంబసభ్యులే గ్లౌజ్‌లు.. మాస్కులు ధరించి అధికారుల సూచ‌న‌ల‌తో అత‌డి అంత్యక్రియలు చేశారు. ప్ర‌స్తుతం వారికి వైర‌స్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌నున్నారు. వీరిలో ఎంత‌మందికి పాజిటివ్ తేలుతుందో ఉత్కంఠ ఏర్ప‌డింది.
Tags:    

Similar News