మమత అనూహ్య నిర్ణయం !?

Update: 2021-07-24 05:30 GMT
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతబెనర్జీ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలకసాత్ర పోషించేందుకు ముఖ్యమంత్రి మమతబెనర్జీ రెడీ అయిపోయారు. ఇందుకనే తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ముఖ్యమంత్రి మమతబెనర్జీ ఎన్నికయ్యారు. ఈ పరిణామం దేశ రాజధానిలోని మిగిలిన పార్టీల నేతలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికే బెంగాల్ సీఎంగా ఉన్న మమత బెనర్జీ ఢిల్లీలోని పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికవ్వటమే అనూహ్యమనే చెప్పాలి.

మామూలుగా పార్టీ అధినేతలుగా ఎవరున్నా ముఖ్యమంత్రులుగా మాత్రమే ఉన్నారు. అంతేకానీ ఇటు ముఖ్యమంత్రి గాను అటు పార్లమెంటరీ పార్టీ నేతగా డబల్ యాక్షన్ ఎవరు చేయలేదు. పార్లమెంటరీ పార్టీ నేతగా సీనియర్ గానో లేకపోతే తమకు అత్యంత నమ్మకస్తుడైనా ఎంపినో నియమిస్తారు. కానీ మిగిలిన పార్టీలకు భిన్నంగా తృణమూల్ ఎంపిలు మాత్రం తమ నేతగా మమత బెనర్జీ నీ ఎన్నుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.

మమత బెనర్జీ విషయంలో జరిగిన తాజా పరిణామాలతో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే ఉద్దేశ్యంతోనే పార్లమెంటరీ పార్టీ నేతగా తానే బాధ్యతలు తీసుకున్నట్లు అర్ధమైపోతోంది. పార్లమెంటరీ పార్టీ నేతంటే రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులను తరచు కలుస్తుంటారు. ఒకవైపు సీఎంగా మరోవైపు పార్లమెంటరీ పార్టీ నేతగా డబల్ యాక్షన్ చేయటం అంత ఈజీకాదు. అయినా రెండు పదవులను మమత బెనర్జీ తీసుకున్నారంటే ఆశ్చర్యంగా ఉంది.

ఒకవేళ కేంద్రంలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం వస్తే బెంగాల్లో తన స్ధానంలో మేనల్లుడు అభిషేక్ బెనర్జీని కూర్చోబెట్టడానికి మమత సిద్ధమైనట్లు అనుమానంగా ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడికి వ్యతిరేకంగా దేశంలోని ప్రతిపక్షాలను ఏకంచేసే విషయంలో మమత చురుకైన పాత్ర పోషించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే సోనియాగాంధీ, శరద్ పవార్, కేజ్రీవాల్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి మాయావతి లాంటి వాళ్ళతో భేటీలకు రెడీ అవుతున్నారు.

ఏదేమైనా మమత బెనర్జీ తాజా నిర్ణయం చూసిన తర్వాత దేశ రాజకీయాల్లోకి ప్రవేశించాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లే అర్ధమైపోతోంది. మోడి వ్యతిరేక ఫ్రంట్ కు తానే సారధ్యం వహించాలనే బలమైన కోరిక మమతలో పెరిగిపోతోంది. అయితే సోనియా నేతృత్వంలోని యూపీఏ గురించి మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ సహకారం లేనిదే మోడి ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యంకాదని మమత బెనర్జీయే బహిరంగంగా చెబుతున్నారు. ఇక్కడే ఏమి చేయాలో తెలీక దీదీ కన్ఫ్యూజ్ అవుతున్నారు. మొత్తానికి తొందరలోనే ఈ కన్ఫ్యూజన్ కు తెరపడుతుందేమో చూడాలి.


Tags:    

Similar News