దాడి జరిగిందని దీదీ నాటకాలు ఆడుతున్నారా?

Update: 2021-03-11 04:28 GMT
హైటెన్షన్ పుట్టిస్తున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పోటాపోటీగా సాగుతున్న ఈ ఎన్నికల్లో.. అధికార టీఎంసీ.. విపక్ష బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుపు తమదేనని రెండు పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఇలాంటివేళ.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సొంతంగా బరిలోకి దిగుతున్న నందిగ్రామ్ నియోజకవర్గ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమెపై అనూహ్య రీతిలో దాడి జరిగినట్లుగా వార్తలు రావటంతో పాటు.. కొన్ని పోటోలు బయటకు వచ్చాయి.

ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది. ఒక ముఖ్యమంత్రిపై దాడి జరగటం ఏమిటి? అందునా ఎన్నికల వేళ.. భద్రతను మరింత కట్టుదిట్టం చేసి ఉంటారు కదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. దీదీపై జరిగిన దాడిని బీజేపీ.. కాంగ్రెస్ లు తప్పు పడుతున్నాయి. ఎన్నికల వేళ దీదీ నాటకాలు ఆడుతున్నారని కాంగ్రెస్ మండిపడింది.

దాడి జరిగిందన్న సానుభూతి ద్వారా ఎన్నికల్లో లబ్థి పొందాలన్నఆలోచనలో దీదీ ఉన్నారని ఆ పార్టీ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ నేత అధిర్ రంజన్ చౌధరి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మమత వద్దే హోంమంత్రిత్వ శాఖ ఉందని.. అలాంటిది ఆమె పర్యటన సందర్భంగా పోలీసులే లేరని చెబితే నమ్మగలమా? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు.

నందిగ్రామ్ లో కారు డోర్ తీసే క్రమంలో నలుగురైదుగురు తనపై దాడి చేసినట్లుగా మమత చెబుతున్నారు. దాడి కుట్రేనని.. తన వెనుక సిబ్బంది ఎవరూ లేరని చెప్పారు. కనీసం ఒక్క పోలీసు కూడా లేకపోవటంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి స్వయంగా ప్రచారానికి వస్తే.. ఒక్క పోలీసు కూడా లేకపోవటం ఏమిటి? అన్నది సందేహం. ఇదే అంశంపై బీజేపీ సైతం కాంగ్రెస్ తరహాలోనే స్పందించింది.

తనపై దాడి జరిగిందని మమత నాటకాలు ఆడుతున్నట్లుగా బెంగాల్ కమలనాథులు మండిపడుతున్నారు. ఎన్నికల ప్రయోజనం కోసం తనపై తాను దాడి చేయించుకునే వరకు దీదీ వెళతారా? అన్నదిప్పుడు ప్రశ్నలుగా మారాయి. మరి.. విపక్షాలు లేవనెత్తిన సందేహాలకు దీదీ సమాధానాలు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నందిగ్రామ్ లో మమత తన నామినేషన్ దాఖలు చేసిన రోజునే ఆమెపై దాడి జరిగినట్లుగా చెప్పటం గమనార్హం.
Tags:    

Similar News