ఆమె గ్రేట్ అంతే.. రూ.7 వేల కోట్ల అప్పుల్ని రూ.1800 కోట్లకు తగ్గించింది

Update: 2022-09-01 04:26 GMT
కొండంత అండగా ఉండే భర్త అనూహ్య రీతిలో ఆత్మహత్య చేసుకోవటం ఒక పెద్ద షాక్ అయితే.. తిరుగులేని వ్యాపార సామ్రాజ్యంగా కనిపించే బిజినెస్ లో బోలెడన్ని అప్పులు భయపెట్టే వేళలో.. ఆ వ్యాపార సారధ్య బాధ్యతల్ని చేపట్టటం అంత మామూలు విషయం కాదు. అప్పుల ఊబిలో చిక్కుకొన్న సంస్థకు చికిత్స చేసి.. కొండలా పేరుకున్న అప్పుల్ని బద్ధలు చేస్తూ తగ్గించే ప్రక్రియ అంత ఈజీ కాదు. కానీ.. ఈ తరహా సవాళ్లను సులువుగా అధిగమిస్తున్నారు కాఫీ డే సారధ్య బాధ్యతల్ని చేపట్టిన మాళవికా హెగ్డే.

2019 మార్చి 31 నాటికి కాఫీ డే ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ కు రూ.7214 కోట్ల అప్పులు ఉంటే ఈ మార్చి 31 నాటికి రూ.1810 కోట్లకు తగ్గిన వైనం ఆసక్తికరంగా మారింది. 2021 మార్చి నాటికి రూ.1898 కోట్లుగా ఉన్న అప్పులు 2022 మార్చి 31 నాటికి రూ.1810 కోట్లకు తగ్గినట్లుగా కంపెనీ పేర్కొంది.

ఇవి కాకుండా అసలు.. వడ్డీ కలిపి రూ.230.66 కోట్ల మేర అప్పులు.. ఫైనాన్స్ సంస్థలకు చేయాల్సిన చెల్లింపులు మిగిలి ఉన్నాయి. ఇవి కాకుండా మరో రూ.249.02 కోట్ల మేర నాన్ కన్వెర్టబుల్ డిబెంచర్లు ఉన్నాయని కంపెనీ చెబుతోంది.

కాఫీ డే వ్యవస్థాపకుడైన వీజీ సిద్ధార్థ్ 2019 జులైలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన మరణించే నాటికి రుణాల్ని చెల్లించలేని స్థితిలో కంపెనీ ఉంది. ఇలాంటి వేళ.. కంపెనీ పగ్గాలు చేపట్టిన సిద్ధార్థ్ భార్య మాళవికా హెగ్డే కంపెనీకి పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ప్రయాణంలో బఆగంగా ఇప్పటికే అప్పుల్లో దాదాపు 70 శాతానికి పైనే తీర్చేసిన ఆమె.. మిగిలిన 30 శాతాన్ని కూడా పూర్తి చేయగలిగితే.. అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నట్లే.

ఇప్పటివరకు సాగిన ప్రయాణం ఒక ఎత్తు అయితే.. రానున్న రోజుల్లో ఎదురయ్యే సవాళ్లు మరో ఎత్తుగా చెబుతున్నారు. 158 నగరాల్లో 495 కేఫ్ కాఫీ డే ఔట్ లెట్లను నిర్వహిస్తున్న సంస్థ.. కార్పొరేట్ కార్యాలయాల్లోనూ హోటళ్లలోనూ కాఫీ డే పేరుతో 38 వేలకు పైగా వెండింగ్ మెషిన్లు ఉండటం తెలిసిందే.

భారతీయులకు సుపరిచితమైన కాఫీకి.. సరికొత్త హంగులు దిద్దటంలో కేఫ్ కాఫీ కీ రోల్ ప్లే చేసిందని చెప్పక తప్పదు. భర్త పోయిన పుట్టెడు శోకంలో దాన్ని దిగమింగుకుంటూ.. సవాళ్లకు ఎదురొడ్డి ఆమె చేస్తున్న ప్రయాణం మరింత వేగంగా విజయాలు సాధిద్దామని ఆశిద్దాం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News