ఆస్తులంతా ప్రజలకిచ్చేస్తానన్న మంత్రి

Update: 2016-10-23 09:53 GMT
రాజకీయాల్లోకి వచ్చి వందల కోట్లు సంపాదించుకోవాలని చూసేవారే తప్ప జనం కోసం బతికే నాయకులు భూతద్దం పెట్టి వెతికినా కనిపించని కాలమిది. ప్రతి పనిలో వాటాలు తీసుకుని కోట్లాది రూపాయలు పోగేసుకునేవారు కొందరైతే... ప్రభుత్వంలో పైరవీలు చేసుకుని అన్ని కాంట్రాక్టులూ తామే తీసుకుని సంపద పోగేసుకునేవారు ఇంకొందరు.. గనులు - పనులతో గల్లా పెట్టెలు నింపుకొనేవారు మరికొందరు.. ఇలా ఎమ్మెల్యేల నుంచి ఎంపీలు - మంత్రులు అంతా మిలియనీర్లే.  ఏ నేత ఆస్తి చూసినా అమ్మో అని ఆశ్చర్యపోవాల్సిందే. కొందరు నేతలు ఆర్భాటంగా ఆస్తులు ప్రకటిస్తున్నా అవి సముద్రంలో కాకిరెట్టంత మాత్రమేనన్న విమర్శలు ఉంటున్నాయి. ఇలాంటి తరుణంలో ఒక మంత్రి తన ఆస్తులను ప్రజలకు పంచేస్తానని ప్రకటించడం సంచలనం రేపుతోంది. అవును ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో సాగర తీరంలో ఉన్న యానాం(పాండిచ్చేరి రాష్ట్రంలో భాగం) ఎమ్మెల్యే - పాండిచ్చేరి రాష్ట్ర మంత్రి అయిన మల్లాడి కృష్ణారావు సంచలన ప్రకటన చేశారు. తన ఆస్తులను ప్రజలకు ఇచ్చేస్తానని బహిరంగంగా ప్రకటించారు.

తన మొత్తం ఆస్తులను ప్రజల సమక్షంలో విక్రయించి వాటిని నిరుపేదల కష్టాలు తీర్చేందుకు వినియోగిస్తానంటూ శనివారం సంచలన ప్రకటన చేశారు. తన ఆస్తుల వేలం ద్వారా వచ్చిన మొత్తం సొమ్మును ఇంటి గడపదాటి బయటకు రాలేని దుర్భర స్థితిలో ఉన్న నిరుపేదలకు పంచనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

తను ఉండే ఇంటిని మాత్రం మినహాయించి భార్య, తనకు సంబంధించిన బంగారం - కార్లు - మోటారు సైకిళ్లను ప్రముఖులు - ప్రజల సమక్షంలో బహిరంగ వేలం వేసి వచ్చిన డబ్బుతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి పేదలకు పంపిణీ చేస్తానని మల్లాడి స్పష్టం చేశారు. ఆస్తులు అమ్మి పేదలకు పంచుతానన్న మంత్రి నిర్ణయంపై సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.... యానాం చుట్టూ ఉన్న ఏపీలోని మంత్రులు మాత్రం ఇదేం గోలండీ బాబూ.. జనం మనల్ని కూడా ఆస్తులు పంచమని అడిగితే ఏం చేయాలి?అంటూ మల్లాడిని తిట్టుకుంటున్నారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News