'మహా' ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ?

Update: 2022-06-28 05:52 GMT
మహారాష్ట్ర ప్రభుత్వం సంక్షోభం తొందరలోనే కీలక మలుపు తీసుకోబోతున్నదా ? అవుననే సమాధానం వినిపిస్తోంది తాజా పరిణామాలను చూస్తుంటే. శివసేనలోని తిరుగుబాటు వర్గం తొందరలోనే సీఎం ఉథ్థవ్ థాక్రే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో శివసేన+ఎన్సీపీ+కాంగ్రెస్ కలిసి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) పేరుతో సంకీర్ణప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.

ఎవరు ఊహించని రీతిలో శివసేనలో పార్టీ చీఫ్ పై క్యాబినెట్ మంత్రి ఏక్ నాథ్ షిండే నాయకత్వంలో తిరుగుబాటు మొదలైంది. షిండే నాయకత్వంలో సుమారు 38 మంది ఎంఎల్ఏలున్నారు.

వీరిలో  ఏడుగురు మంత్రులు కూడా ఉన్నా వారిని థాక్రే తొలగించారు. షిండే నాయకత్వంలోని తిరుగుబాటు లేవదీసిన ఎంఎల్ఏల్లో 15 మందిపై అనర్హత వేటు వేయాలని థాక్రే అనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం డిప్యుటి స్పీకర్ నరహరి 15 మంది ఎంఎల్ఏలకు అనర్హత వేటు నోటీసులను కూడా జారీచేశారు.

అయితే తిరుగుబాటు ఎంఎల్ఏలు అనర్హత నోటీసులపై సుప్రింకోర్టులో సవాలు చేశారు. దాంతో కోర్టు జోక్యం చేసుకుని నోటీసులకు జవాబు ఇచ్చే సమయాన్ని జూలై 12 వరకు ఇచ్చింది. డిప్యుటి స్పీకర్ ఇచ్చిన గడువైతే సోమవారం సాయంత్రంతోనే ముగిసిపోయింది.

మొత్తానికి అన్నీ విధాలుగా తమకు గట్టి రక్షణనే తిరుగుబాటు ఎంఎల్ఏలు ఏర్పాటు చేసుకున్నారని అర్ధమైపోతోంది. తమదే అసలైన శివసేన పార్టీగా రెబల్స్ అంటున్నా అది అంత తేలికకాదు.

అందుకనే తమను శివసేన (బాలాసాహెబ్) వర్గంగా గుర్తించాలని షిండే డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం అలా ప్రత్యేక వర్గంగా గుర్తించేందుకు అవకాశం లేదని సమాచారం.  అయితే  వీళ్ళంతా ఏదైనా పార్టీలో విలీనమైపోయేందుకు అవకాశముంది. మరి విలీనం గురించి షిండే ఆలోచిస్తున్నారో లేదో తెలీదు. అయితే తాజా పరిణామాల ప్రకారం తొందరలోనే ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో షిండే ఉన్నట్లు తెలుస్తోంది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
Tags:    

Similar News