దొరికినా... ఈ దొంగ దొరే!

Update: 2018-06-27 10:49 GMT
జే. శేఖ‌ర్ రెడ్డి... తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్ధానం(టీటీడీ) పాల‌కమండ‌లిలో స‌భ్యుడిగా - బోర్డులో త‌మిళ‌నాడు ప్ర‌తినిధిగా అంత‌గా ప్ర‌చారంలోకి రాలేక‌పోయినా... నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో సింగిల్ క‌రెన్సీ నోటు కోసం దేశ ప్ర‌జ‌లంతా బ్యాంకులు - ఏటీఎంల ముందు గంట‌ల త‌ర‌బ‌డి క్యూలో నిలుచుంటే - కొంద‌రు ఏకంగా ప్రాణాలు కోల్పోతే... త‌న ఇంటిలో మాత్రం కోట్ల‌కు కోట్లు కొత్త క‌రెన్సీ నోట్ల‌ను మూట‌గ‌ట్టేసుకుని ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు అడ్డంగా దొరికిపోయిన వైనంతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చేశారు. దీనిపై కేసులు న‌మోద‌య్యాక‌... టీటీడీ బోర్డు స‌భ్యుడిగా శేఖ‌ర్ రెడ్డి ఏ మేరకు చ‌క్రం తిప్పాడు? త‌మిళ‌నాట కాంట్రాక్ట‌రుగా ఎంత‌మేర సంపాదించాడు? త‌మిళ స‌ర్కారుకు ఎంత ఆప్తుడు? అక్క‌డి రాజ‌కీయ పార్టీల‌కు ఏ మేర స‌న్నిహితుడు? అస‌లు త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత టీటీడీ బోర్డులో త‌న రాష్ట్ర ప్ర‌తినిధిగా శేఖ‌ర్ రెడ్డినే ఎందుకు ప్ర‌తిపాద‌డించారు?  ఆ ప్ర‌తిపాద‌న‌కు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఏ విధంగా స్పందించారు? ఆ త‌ర్వాత చంద్ర‌బాబు ఫ్యామిలీతో శేఖ‌ర్ రెడ్డి ఎంత‌గా మింగిల్ అయిపోయారు? అన్న విష‌యాల‌తో లెక్క‌లేన‌న్ని క‌థ‌నాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. మొత్తంగా జ‌నం క‌రెన్సీ నోట్ల కోసం ప‌డ‌రాని పాట్లు ప‌డుతుంటే... శేఖ‌ర్ రెడ్డి మాత్రం ఎంచ‌క్కా కోట్లాది రూపాయ‌ల విలువ చేసే కొత్త క‌రెన్సీని త‌న ఇంటిలో ద‌ర్జాగా దాచేసుకున్నారు.

నాటి ప‌రిస్థితుల‌ను ఓసారి గుర్తు చేసుకుంటే... శేఖ‌ర్ రెడ్డి చేసింది ముమ్మాటికీ నేర‌మే. శేఖ‌ర్ రెడ్డి లాంటి వ్య‌క్తులు అర‌కొర‌గా వ‌చ్చిన కొత్త క‌రెన్సీ నోట్ల‌ను త‌మ నేల‌మాళిగ‌ల్లో దాచేసుకుంటే... ఇక క‌నీస అవ‌స‌రాల కోసం కూడా సామాన్యుడికి క‌రెన్సీ నోట్లు ఎలా దొరుకుతాయి?  నిజ‌మే... ఈ కోణంలోనే వ్య‌వ‌హ‌రించిన ఆదాయ‌ప‌న్ను శాఖ నాడు దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులు చేసింది. అడ్డంగా దొరికిపోయిన శేఖ‌ర్ రెడ్డిపై కేసు న‌మోదు చేసి విచార‌ణ చేప‌ట్టాల‌ని కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐకి లేఖ రాసేసింది. ఈ లేఖ ఆధారంగా కేసు న‌మోదు చేసిన సీబీఐ శేఖ‌ర్ రెడ్డిపై కేసు న‌మోదు చేయ‌డంతో పాటుగా ఈ మొత్తం వ్య‌వ‌హారంపై ద‌ర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్‌ దాఖ‌లు చేసింది. దీంతో విచార‌ణ మొద‌లెట్టిన మ‌ద్రాసు హైకోర్టు... శేఖ‌ర్ రెడ్డి నేరం చేసిన‌ట్లుగా నిర్ధారించ‌లేమ‌ని, ఇందుకు స‌రిప‌డ సాక్ష్యాలు లేవ‌ని, ఏకంగా శేఖ‌ర్ రెడ్డిని నిర్దోషిగా ప్ర‌క‌టించేసింది. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం మ‌ద్రాసు హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది.

నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో క‌రెన్సీ నోట్ల‌కు క‌ట‌క‌ట ఏర్ప‌డిన ప‌రిస్థితుల్లో ప‌రిమితిమి మించి క‌రెన్సీ పోగేసిన శేఖ‌ర్ రెడ్డి ముమ్మాటికీ నేర‌స్థుడి కిందే లెక్క‌. అయినా నాడు ఒక్క క‌రెన్సీ నోటు  దొర‌క‌డమే గ‌గ‌నంగా మారిపోతే... శేఖ‌ర్ రెడ్డికి మాత్రం ల‌క్ష‌లాది నోట్లు ఎలా దొరికాయి? ఏ బ్యాంకు మేనేజ‌ర్లు ఆయ‌న‌కు ఆ నోట్లు అంద‌జేశారు? ఆ నోట్ల కోసం శేఖ‌ర్ రెడ్డి ఎన్ని అడ్డదార్డు తొక్కారు?... ఈ త‌ర‌హా ప్ర‌శ్న‌లెన్నో ఇప్పుడు జ‌నం మ‌దిలో మెద‌లుతున్నాయి. అయినా క‌రెన్సీ నోట్ల‌తో రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డ శేఖ‌ర్ రెడ్డి వ్య‌వ‌హారంలో కోర్టుకు స‌రిప‌డ సాక్ష్యాలు సంపాదించ‌డంలో ద‌ర్యాప్తులో తీస్‌మార్ ఖాన్ బిరుదును కైవ‌సం చేసుకున్న సీబీఐకి ఎందుకు చేత‌గాలేదో? ఆ దేవ‌దేవుడిగే తెలియాలి? ఏదైతేనేం... అడ్డంగా దొరికినా కూడా దొంగ దొర‌గా బ‌య‌ట‌పడిపోయాడు.

Tags:    

Similar News