పెట్రోల్.. డీజిల్ బాదుడు సరిపోదన్నట్లు.. తాజాగా గ్యాస్ బండేశారే..

Update: 2020-12-03 03:31 GMT
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ప్రయాణ ఖర్చులు తడిచి మోపెడు అవుతున్నాయి. ఇవి సరిపోదన్నట్లుగా పెట్రోల్.. డీజిల్ ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే లీటరు పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో మరింత ఎక్కువగా ఉందన్న సంగతి తెలిసిందే. ఈ బాదుళ్లు సరిపోవని అనుకున్నారో ఏమో కానీ.. తాజాగా నిత్యవసర వస్తువు అయిన గ్యాస్ బండకు రూ.50 చొప్పున బాదేశారు.

ఇప్పటికే ధరాభారంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్య.. మధ్యతరగతి జీవులపై ఇదో భారంగా మారింది. ఎల్పీజీ సిలిండర్ ధర ఒకేసారి రూ.50 పెంచితే.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.54.50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెద్దగా ప్రకటనలు ఏమీ చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా గ్యాస్ బండ ధర పెరిగింది. డిసెంబరు 1 అర్థరాత్రి నుంచి సైలెంట్ గా పెంచేసి.. షాకిచ్చారు.

ఎప్పటిలానే గ్యాస్ బండ బుక్ చేసుకున్న వారికి.. పెరిగిన ధరతో వచ్చిన బిల్లును చూసి అవాక్కు అవుతున్నారు. తాజాగా పెరిగిన గ్యాస్ బండ ధరతో దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు ఉన్న రూ.594 గ్యాస్ బండ ఇప్పుడు  రూ.644కు పెరిగినట్లైంది. ఇక.. మైదరాబాద్ లో ఇప్పటివరకు రూ.646.50 వసూలు చేస్తున్నారు. తాజాగా పెరిగిన ధరతో అది కాస్తా రూ.696.50కు పెరిగినట్లైంది. ఇక.. కమర్షియల్ గ్యాస్ ధర ఢిల్లీలో రూ.1241.50 ఉండగా.. ఇప్పుడు రూ.1296కు పెరిగింది. కమర్షియల్ గ్యాస్ ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉన్నాయి. ఏమైనా.. జీతం తప్పించి ప్రతిది పెరగటమే కానీ తగ్గే పరిస్థితి కనిపించటం లేదన్న మాట అక్షరసత్యంగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News