ప‌వ‌న్‌ తో ఆ పోలిక స‌రికాదంటున్న లోకేష్

Update: 2017-08-02 17:01 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు మంత్రి నారా లోకేష్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. అమ‌రావ‌తిలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ రాజ‌కీయాలు - ప‌రిపాల‌న - ఏపీలోని వివిధ ప‌రిణామాల గురించి కూలంక‌షంగా చ‌ర్చించారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య కొంత గ్యాప్ ఉన్నమాట వాస్తవమని అంగీక‌రించారు. అయితే అందరినీ కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి అన్నారు. అయిన‌ప్ప‌టికీ పార్టీ బ‌లోపేతానికి ముందుకు సాగుతున్నామ‌ని లోకేష్ అన్నారు.

ఒకరిద్దరు చేసిన తప్పులను అందరికీ ఆపాదించలేమని మంత్రి నారా లోకేష్ అన్నారు. అవినీతికి పాల్పడే ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాపు ఉద్య‌మ నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంకు, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కు పోలిక పెట్ట‌డం స‌రికాద‌ని లోకేష్ అన్నారు. ప‌వ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకునే వ్య‌క్తి అయితే..ముద్ర‌గ‌డ స‌మ‌స్య‌లు సృష్టించే వ్య‌క్తి అని లోకేష్ ఎద్దేవా చేశారు. ఈ ఇద్ద‌రికీ పోలిక స‌రైన‌ది కాద‌ని లోకేష్ అన్నారు. ప‌రిపాల‌న‌లో బిజీ అయిపోవ‌డం వ‌ల్ల త‌న క‌టుంబంతో గ‌డిపే స‌మ‌యం అస్స‌లు దొర‌క‌డం లేద‌ని లోకేష్ వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తో త‌న‌కు పోలిక స‌రికాద‌ని అన్నారు. త‌న పోటీ త‌న తండ్రి అయిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతోనేన‌ని లోకేష్ తెలిపారు. జూనియ‌ర్ ఎన్టీఆర్‌ తో త‌న‌కు విబేధాలు లేవ‌ని లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఈ విష‌యంలో అన‌వ‌స‌ర దుష్ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు.

ఈ సంద‌ర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డిపై లోకేష్ విరుచుకుప‌డ్డారు. ముఖ్య‌మంత్రి సీటు గురించి జ‌గ‌న్ క‌ల‌లు కంటున్నారు కానీ రౌడీషీట‌ర్ మ‌న‌స్త‌త్వం క‌లిగిన జ‌గ‌న్‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో 25 సీట్లు కూడా రావ‌న్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీకి 140 సీట్లు త‌మ‌కు వస్తాయని, రాబోయే ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి పీఠం చేప‌ట్టేది నారా చంద్ర‌బాబు నాయుడేన‌ని ధీమా వ్య‌క్తం చేశారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ గెలుపు ఖాయ‌మ‌ని ఆయ‌న తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గాల పెంపు గురించి త‌మ‌కు న‌మ్మ‌కం ఉందని లోకేష్ తెలిపారు.

Tags:    

Similar News