10 కోట్ల జరిమానా చెల్లించడానికి చిన్నమ్మ సిద్ధం .. వచ్చే ఫిబ్రవరి లో విడుదలయ్యే ఛాన్స్ !

Update: 2020-10-20 14:10 GMT
చిన్నమ్మ .. అలియాస్ శశికళ , ఇక జైలు నుండి బయటకి రావడానికి నిర్ణయం తీసుకున్నారు. కోర్ట్ నిబంధనల ప్రకారం నిర్ణీత జరిమానా చెల్లించి 2021 ఫిబ్రవరిలో విడుదలయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. స్వయంగా శశికళే తన న్యాయవాదికి రాసిన లేఖతో ఈ విషయం స్పష్టమైంది. అక్రమ ఆస్థుల కేసులో కర్నాటక జైళ్లో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు చిన్నమ్మ  విడుదలకు రంగం సిద్దమౌతోంది.   నిబంధనల ప్రకారం నిర్ణీత మొత్తంలో జరిమానా చెల్లిస్తే  శిక్షాకాలం కంటే ముందే అంటే 2021 ఫిబ్రవరి 21న విడుదలయ్యేందుకు అవకాశాలున్నాయని జైళ్ల శాఖ  నుంచి గతంలో ఓ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. దీనితో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తునట్టు తాజాగా వెల్లడైన లేఖతో వెలుగులోకి వచ్చింది.

మరోవైపు తమిళనాట వచ్చే ఏడాది ఎన్నికలు కూడా ఉన్న తరుణంలో చిన్నమ్మ బయటకు వస్తే ఏం జరుగుతుంది..పరిస్థితి ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే జయలలిత  నేతృత్వం వహించిన ఏఐఏడీఎంకే పార్టీ   ఇప్పుడు పూర్తిగా పళనిస్వామి , పన్నీర్ సెల్వం ల చేతిలో వెళ్లిపోయింది. జయలలిత తరువాత కాస్తా కూస్తో ప్రజాదరణ ఉన్నది శశికళకే.అందుకే ఇప్పుడు అందరి దృష్టి శశికళపైనే ఉంది. ఈ నేపధ్యంలో 10 కోట్ల జరిమానా చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలంటూ చిన్నమ్మ శశికళ తన న్యాయవాదికి రాసిన లేఖ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

కరోనా కారణంగా మార్చి నుండి ఆమెతో ములాఖత్‌ అయ్యేందుకు సన్నిహితులు, న్యాయవాదులకు కర్ణాటక అనుమతి ఇవ్వకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. మార్చి నుంచి తనతో ములాఖత్ ‌లను కర్ణాటక జైళ్ల శాఖ నిలుపుదల చేసిందని, ఎప్పుడు పునరుద్ధరిస్తుందో తెలియదన్నారు. ఈ నేపథ్యంలో శశికళ తన న్యాయవాదికి రాసిన లేఖ సోమవారం వెలుగులోకి వచ్చింది.  10 కోట్ల రూపాయల జరిమానా చెల్లింపునకు సిద్ధంగా ఉండాలని, అదేవిధంగా కోర్టు వ్యవహారాలు,న్యాయపరమైన అంశాల్ని ఎదుర్కొనేందుకు ఢిల్లీలోని సీనియర్ న్యాయవాదుల్ని సంప్రదించాలని లేఖలో కోరారు. తమిళనాడును కరోనా వణికిస్తోందని, దాని ప్రభావం పెరిగే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో రాష్ట్రం కరోనా నుంచి పూర్తిగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు వివరించారు.
Tags:    

Similar News