వైసీపీ కంచుకోటలో సైకిల్ పరుగులు....?

Update: 2022-03-04 01:30 GMT
వైసీపీకి కంచుకోటలాంటి జిల్లా అది. అక్కడ దశాబ్దాలుగా ఆ పార్టీ హవానే సాగుతూ వస్తోంది. అయితే అన్ని రోజులూ ఒక్కలా ఉండవు. అలాగే రాజకీయం కూడా మారుతూ వస్తుంది. అదే ఇపుడు ప్రత్యర్ధి పార్టీలకు  అవకాశాలను ఇస్తోంది. రాయలసీమ జిల్లాల్లో కడప ప్రత్యేకత వేరు. ఇది వైఎస్సార్ ఫ్యామిలీకి బలమైన స్థావరంగా  ఉంటోంది. నాడు వైఎస్సార్ అయినా నేడు జగన్ అయినా ఈ జిల్లాను చూసుకునే ప్రత్యర్ధుల సవాళ్ళకు ధీటైన జవాబు చెప్పేవారు.

ఇక కడపలో టీడీపీకి పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా పెద్దగా బలం సమకూరడంలేదు. ఎపుడూ కూడా ఆ పార్టీ మెజారిటీ సీట్లు సొంతం చేసుకున్నది లేదు. అయితే కడప జిల్లాలో టీడీపీకి బలమైన నాయకులు ఉన్నారు. మొదట్లో రామమునిరెడ్డి, సి రామచంద్రయ్య వంటి వారు పార్టీ తరఫున కడప అసెంబ్లీలో గెలిచి సత్తా చాటారు. జమ్మలమడుగు లాంటి చోట్ల రామసుబ్బారెడ్డి వంటి వారూ అండగా నిలిచారు.

దాంతో చంద్రబాబు సీఎం అయ్యాక కడప జిల్లా మీద ఫుల్ ఫోకస్ పెట్టి ఒక దశలో వైఎస్సార్ విజయం కూడా కష్టం అనే సీన్ తీసుకుని రాగలిగారు. అయితే ఆ తరువాత వైఎస్సార్ మళ్ళీ పుంజుకుని తన దూకుడు పెంచేశారు. అది ఆయన సీఎం అయ్యేంతవరకూ సాగింది. అదే ఊపుని కుమారుడు జగన్ కూడా అందుకున్నారు. మొత్తానికి చూస్తే గత రెండు దశాబ్దాలుగా కడప జిల్లాలో టీడీపీ ఎపుడు గెలిచినా ఒకటీ అరా సీట్లు మాత్రమే అన్నది స్పష్టం.

ఇక జగన్ హయాంలో 2014లో టీడీపీకి రాజంపేట ఒక సీటు దక్కితే, 2019లో మొత్తానికి మొత్తం పది సీట్లూ వైసీపీ పరం అయి గుండు సున్నా రిజల్ట్ వచ్చింది. అలాంటి కడప గడపలో ఇపుడు సీన్ మారుతోంది అంటున్నారు. టీడీపీకి ఇపుడు యువ సారధులు అన్ని చోట్లా ఉన్నారనే చెప్పాలి. వారంతా బలమైన సామాజికవర్గానికి చెందిన నేతలు కూడా కావడం విశేషం.

ఇక వీరిలో పొద్దుటూరు టీడీపీ ఇంచార్జి ప్రవీణ్ రెడ్డి చాలా జోరు చేస్తున్నారు. ఇక్కడ రెండు సార్లు వైసీపీ టికెట్ మీద గెలిచిన రాచమల్లు శివప్రసాదరెడ్డి సైతం ఆయన స్పీడ్ ని తట్టుకోలేకపోతున్నారు. పైగా రాచమల్లు మీద బాగా వ్యతిరేకత పెరుగుతోంది. దాంతో పొద్దుటూరులో పెద్ద ఆశలే టీడీపీకి ఉన్నాయని అంటున్నారు.

అదే విధంగా జమ్మలమడుగు సీటు. ఇక్కడ సహజంగానే టీడీపీకి బలం ఉంది. అయితే 2014లో ఆదినారాయణరెడ్డి వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరారు, మంత్రి అయ్యారు, దాంతో అదనపు బలం కూడా వచ్చింది. కానీ 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ వల్ల సుధీర్ రెడ్డి గెలిచారు. 2024లో మాత్రం అలా ఉండదని అంటున్నారు. ఇక్కడ టీడీపీ ఇంచార్జిగా దేవగుడి భూపేష్ రెడ్డి ఉన్నారు. ఈయన యంగ్ టర్క్. పైగా ఢీ అంటే ఢీ అనే రకం. ఇపుడు జమ్మలమడుగులో సైకిల్ ని పరుగులు పెట్టిస్తున్నది ఈయనే.

వీటికి మించి మరో సీటు ఉంది. అది ఏకంగా జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల. ఇక్కడ బీటెక్ రవి యమ జోరు చేస్తున్నారు. మాజీ మంత్రి వివేక హత్య కేసు విషయంలో ఆయన వైసీపీ పెద్దలనే టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. గతానికి భిన్నంగా ఆయన తన పదునైన మాటలతో కూడా కొత్త వ్యూహాలు రచిస్తున్నారు.  అలాగే రాజంపేట సీటు కూడా టీడీపీని ఊరిస్తోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి టీడీపీలోకి జంప్ అవుతారు అంటున్నారు. మూడు తడవలుగా గెలిచిన ఓటమెరుగని వీరుడు ఆయన.

అదే విధంగా జగన్ సొంత మేన మామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి సీటు కూడా ఇపుడు టీడీపీ వైపు చూస్తోంది అంటున్నారు. ఇక్కడ కూడా టీడీపీకి బలమైన నేతలు ఉన్నారు. దాంతో పులివెందులలో జగన్ కి సరైన ప్రత్యర్ధిని నిలపడంతో పాటు వీలుంటే మూడు నాలుగు సీట్లను ఈసారి కచ్చితంగా టీడీపీ గెలుచుకునే సీన్ అయితే కడపలో ఉంది అంటున్నారు. ఎన్నికలకు మరో రెండేళ్ళ పైన వ్యవధి ఉన్నందువల్ల అప్పటి పరిస్థితి బట్టి మెజారిటీ సీట్లు కడపలో సైకిల్ పరమైనా ఆశ్చర్యపోనవసరం లేదు అని కూడా మరో మాట ఉంది. మొత్తానికి కడప గడప ఈసారి పసుపు రంగు ఎంతో కొంత పూసుకోవడం ఖాయమనే అంటున్నారు.
Tags:    

Similar News