ఇలాగైతే టీడీపీ ఇక గెలిచినట్లే

Update: 2021-09-13 09:56 GMT
మామూలుగా అధికారంలో ఉన్నప్పుడు నేతల మధ్య విభేదాలుంటాయి. ఎందుకంటే పనులని, కాంట్రాక్టులని, పోస్టింగులని ఇలా రకరకాల గొడవల్లో ఆధిపత్యం కోసం గొడవలు సహజమే. కానీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా నేతల మధ్య విభదాలు కంటిన్యూ అవుతున్నాయన్నా లేకపోతే మరింత పెరిగుతున్నాయన్నా దేనికి సంకేతం ? ఒకవైపు అధికారపక్షం వాయించేస్తున్నా నేతల్లో మార్పు రావడం లేదంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఈ గొడవంతా ఏ విషయంలోనో అర్ధమైపోయుంటుంది. అవును తెలుగుదేశం పార్టీ గురించి అందులోను అనంతపురం జిల్లా నేతల గురించే.

ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఎన్ని గొడవలున్నాయో ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అంతకన్నా మరింత ఎక్కువయ్యాయి. తాజాగా అనంతపురంలోని కమ్మ భవన్ లో జరిగిన నేతల సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలతో నేతల మధ్య విభేదాలపై మళ్ళీ చర్చ మొదలైంది. టీడీపీలో పరిస్థితి ఏమిటంటే పార్టీ మీద కార్యకర్తల్లో ఉన్న అభిమానం నేతలకు లేకపోవటమే. సంస్థాగతంగా టీడీపీ చాలా బలమైన పార్టీ అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

పార్టీకి బలమైన పునాదులు పడ్డాయంటే అందుకు ఎన్టీయారే కారణం. మొదటి నుంచి పార్టీకి బీసీ సామాజిక వర్గమే వెన్నెముకగా నిలుస్తోంది. అలాంటి పార్టీకి చంద్రబాబు నాయుడు హయాంలో బీసీలు దూరమవ్వడం మొదలైంది. ఈ విషయం మొన్నటి ఎన్నికల్లో స్పష్టంగా అందరికీ అర్థమైపోయింది.  పదవుల పంపిణీ తర్వాత టికెట్ల కేటాయింపు లాంటి ప్రతి అంశంలోను బీసీలకు పెద్దగా ఒరిగిందేమీలేదు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పటం, ఆచరణలో చూపటంతో బీసీల్లో చీలికవచ్చి ఓ వర్గం వైసీపీకి మద్దతుగా నిలబడింది.

సరే ఈ విషయాలను పక్కనపెట్టేస్తే ఐదేళ్ళ అధికారంలో చంద్రబాబు లాగే మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలు కూడా కార్యకర్తలను పెద్దగా పట్టించుకోలేదన్నది వాస్తవం. ఎంతసేపు తమ వ్యక్తిగత పనులు, కాంట్రాక్టులు, పోస్టింగుల గురించే తప్ప కార్యకర్తలకు ఏమైనా చేయాలనే ఆలోచన కనబడలేదు. దీంతో విసిగిపోయిన కార్యకర్తలు చివరకు మొన్నటి ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేయటమో లేకపోతే అసలు దూరంగా ఉండిపోయారు. పోలింగ్ రోజున చాలా నియోజకవర్గాల్లో పార్టీ తరపున పోలింగ్ ఏజెంట్లే కనబడలేదు.
4

అలాగే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి కానీ పార్టీ తరపున పనిచేయడానికి కానీ కార్యకర్తలు ముందుకురాలేదంటేనే అర్ధమైపోతోంది పార్టీ పరిస్థితి. తాజాగా నేతలు, కార్యకర్తల విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం. దీన్ని చంద్రబాబు కూడా కాదనే అవకాశంలేదు. పార్టీ జెండాలు మోసేది, కట్టేది, బ్యానర్లు కట్టేది కార్యకర్తలే. పార్టీ తరపున ప్రత్యర్థులతో గొడవలైతే ముందుండేది కూడా కార్యకర్తలు. అనంతపురం జిల్లానే తీసుకుంటే మొత్తం 14 నియోజకవర్గాల్లోని నేతల మధ్య విభేదాలు స్పష్టంగా కనబడతాయి. ఈ విషయాన్ని చంద్రబాబు మీడియానే హైలైట్ చేయటం గమనార్హం.
Tags:    

Similar News